భద్రాచలం, అక్టోబర్ 7 : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం లక్ష్మీతాయారు అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. నాలుగు రోజులుగా వైభవోపేతంగా కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించడంతోపాటు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం నిర్వహించిన సామూహిక కుంకుమార్చనకు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే చిత్రకూట మండపంలో శ్రీరామాయణ పారాయణోత్సవాల్లో భాగంగా వేదపండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
‘హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం.. అంటూ శ్రీసూక్తం అమ్మవారిని ధనలక్ష్మిగా కీర్తిస్తుంది. ధనం అంటే.. కేవలం డబ్బు మాత్రమే కాదు.. విద్య, బలం, కీర్తి తదితరాలన్నీ ధనమే. విద్య, హిరణ్య, శక్తి, ధనాలను ప్రసాదిస్తుంది, అందుకే ఈ రూపంలో ఉన్న ధనలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం’ అంటూ పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా కిష్కింధకాండ పారాయణం చేశారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలోని ఉప ఆలయంలో లక్ష్మీతాయారు అమ్మవారు మంగళవారం ధాన్యలక్ష్మిగా భక్తులకు దర్శనమిస్తారు.