భద్రాచలం, అక్టోబర్ 10: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలోని లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. గురువారం ఏడో రోజు అమ్మవారు ఐశ్వర్యలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధిస్తే శాసకత్వం, వాక్కు ప్రభావం, అనంత ఐశ్వర్యం కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. సాయంత్రం నిర్వహించిన సామూహిక కుంకుమార్చనకు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజలు చేశారు. అలాగే చిత్రకూట మండపంలో రామాయణ పారాయణోత్సవాల్లో భాగంగా వేదపండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా.. లక్ష్మీతాయారు అమ్మవారు శుక్రవారం వీరలక్ష్మీగా భక్తులకు దర్శనమిస్తారు.
భద్రాచలం, అక్టోబర్ 10: ఈ నెల 17న భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో శబరి స్మృతి యాత్ర నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 17న ఉదయం 6:30 నుంచి 8:30 గంటల వరకు గిరి ప్రదక్షిణ, చిత్రకూట మండపంలో 8:30 నుంచి 11:30 వరకు నిత్య కల్యాణం, 11:30 నుంచి 12 గంటల వరకు స్వామివారికి వివిధ పుష్ప, ఫలార్చన, మంత్రపుష్పం, ప్రసాద వినియోగం ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు స్వామివారి ప్రచార రథంతో వినాయకపురం నుంచి ముత్యాలమ్మ ఆలయం వరకు శోభాయాత్ర, ఉదయం 10:30 నుంచి 12:30 వరకు ముత్యాలమ్మ ఆలయం వద్ద భద్రాచల స్వామివారి ప్రచారమూర్తుల కల్యాణోత్సవం, అన్నప్రసాద వితరణ ఉంటుందని ఈవో వివరించారు.