భద్రాచలం, అక్టోబర్ 9 : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలోని లక్ష్మీతాయారు అమ్మవారు బుధవారం విజయలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆరో రోజు అర్చకులు అమ్మవారికి స్నపన తిరుమంజనం, ప్రత్యేక పూజలు చేశారు.
సాయంత్రం అర్చకులు సామూహిక కుంకుమార్చన నిర్వహించగా.. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తుశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. విజయలక్ష్మీ రూపంలో ఉన్న అమ్మవారిని సేవిస్తే సునిశితమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే చిత్రకూట మండపంలో రామాయణ పారాయణోత్సవాల్లో భాగంగా వేదపండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలోని ఉప ఆలయంలో లక్ష్మీతాయారు అమ్మవారు గురువారం ఐశ్వర్యలక్ష్మీగా భక్తులకు దర్శనమిస్తారు.