ఖమ్మం, సెప్టెంబర్ 30: అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అదే క్రమంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని, వాటిని ఫుట్‌బాల్ ఆడాలని పిలుపునిచ్చారు. పేదలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. సముద్రమంత సంక్షేమానికి చిరునామాగా, ఆకాశమంత అభివృద్ధికి ఆనవాలుగా ఖమ్మం నియోజకవర్గం నిలిచిందని గుర్తుచేశారు. ఖమ్మం ప్రజలందరి ఆశీర్వాదంతో పేరుకు తగ్గట్టుగానే మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అజేయమైన శక్తిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఖమ్మం నగరంలోని శనివారం పర్యటించిన మంత్రి కేటీఆర్.. నగరంలోని రూ.1,360 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మరో మంత్రి అజయ్‌కుమార్‌తో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
అనంతరం కేఎంసీ కార్యాలయం వద్ద జరిగిన ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ఖమ్మంలో ప్రతిపక్షాలను చెడుగుడు ఆడేందుకు ప్రజల ఆశీర్వాదం ఉంటుందని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఆరు దశాబ్దాల సమస్యలను పరిష్కరించి, మురుగుకూపంగా ఉన్న గోళ్లపాడు కాలువను ప్రక్షాళన చేసి ఆహ్లాదంగా తీర్చిదిద్దామని గుర్తుచేశారు. మంత్రి అజయ్ సారథ్యంలో హైదరాబాద్ తరువాత ఖమ్మంలోనే రెండో అతిపెద్ద బస్టాండ్‌ను నిర్మించామని అన్నారు. రూ.230 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా 50 వేల నల్లా కనెక్షన్లతో ఇంటింటికీ శుద్ధజలాలు అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పాలనలో లకారం ఎంత దుర్భరంగా ఉందో, బీఆర్ఎస్ పాలనలో ఎంత సుందరంగా ఉందో ప్రజలు గమనించాలని కోరారు. కేసీఆర్ నాయకత్వంలో ఖమ్మంలో, కొత్తగూడెంలో రెండు మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలు ఏర్పాటు చేశామని, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను కూడా ఖమ్మానికి మంజూరు చేశామని వివరించారు.
కేసీఆర్, కేటీఆర్ సహకారంతోనే అభివృద్ధి: మంత్రి అజయ్
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతోనే ఖమ్మం నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని మంత్రి అజయ్‌కుమార్ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ఖమ్మానికి వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక అభివృద్ధి పథకానికి శంకుస్థాపన చేస్తున్నారని, ఆ తరువాత వచ్చి దానిని ప్రారంభిస్తున్నారని గుర్తుచేశారు. 2017 నుంచి ఏటా ఇలాగే చేస్తున్నారని గుర్తుచేశారు. ఇందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉండడం అనేది కేసీఆర్ రూపంలో భగవంతుడు ఖమ్మం ప్రజలకు కల్పించిన గొప్ప అదృష్టమని అన్నారు. మంత్రి కేటీఆర్ చొరవ వల్లనే దాదాపు రూ.3 వేల కోట్లతో ఖమ్మాన్ని అభివృద్ధి చేయగలిగామని వివరించారు.
రూ.1,360 కోట్ల పనులకు శంకుస్థాపనలు
ఖమ్మంలో రూ.1,360 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి అజయ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశా రు. శనివారం ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఖమ్మానికి చేరుకున్న మంత్రులు.. తొలుత లకారం ట్యాంక్‌బండ్‌పై రూ.1.37 కోట్లతో నిర్మించిన ఎన్టీఆర్ పారును ప్రారంభించారు. అనంతరం రూ.10 కోట్లతో నగరంలో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు, మరో రూ.2.49 కోట్లతో అమృత్ 2.0 అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం 20వ డివిజన్ ఎస్బీఐటీ కళాశాల రోడ్దు వద్ద రూ.71 లక్షలతో నిర్మించిన స్పోర్ట్స్ పారు (టర్ఫ్ కోర్టు)కు, ప్రకాశ్‌నగర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ పారులో రూ.108.71 కోట్లతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపులైన్ పనులకు, వర్షపు నీరు తరలించే పనులకు, వీడీవోస్ కాలనీ వద్ద రూ.8.54 కోట్లతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మారెట్‌కు, కాల్వొడ్డు వద్ద రూ.690.52 కోట్లతో నిర్మించనున్న మున్నేరు ఆర్సీసీ రక్షణ గోడల నిర్మాణ పనులకు, మున్నేరు వద్ద రూ.180 కోట్లతో నిర్మించనున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు, గట్టయ్య సెంటర్లో ఎల్ ఆర్ఎస్ నిధులు రూ.20 కోట్లతో నిర్మించనున్న రోడ్ల పనులకు, ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి మంజూరు చేసిన టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.100 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టం
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిషరించే అవకాశం తనకు లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన మంత్రి అజయ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. ఎన్టీఆర్ లాంటి మహనీయుడి పేరు తనకు ఉండడం కూడా చాలా సంతోషదాయకమని అన్నారు.
మేయర్, కలెక్టర్, కమిషనర్లకు మంత్రి కేటీఆర్ అభినందన
ఖమ్మంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దినందుకు కేఎంసీ మేయర్ నీరజ, కలెక్టర్ వీపీ గౌతమ్, కమిషనర్ ఆదర్శ్ సురభిలను అభినందిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. అలాగే, 24 గంటలూ ఇంటింటికీ తాగునీళ్లు అందించేలా నగరంగా రాష్ట్రంలోనే ఖమ్మాన్ని మొదటిస్థానంలో ఉంచాలని మంత్రి అజయ్‌ను కోరారు.
మంత్రులకు గజమాలతో సన్మానం
మంత్రులు కేటీఆర్, అజయ్‌లను బీఆర్ఎస్ నాయకులు గజమాలతో సత్కరించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రకాశ్‌నగర్, కాల్వొడ్లు వద్ద వేర్వేరుగా గజమాలలతో మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, మేయర్ పునుకొల్లు నీరజ, జడ్పీ, సుడా, ఏఎంసీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, బచ్చు విజయ్‌కుమార్, దోరేపల్లి శ్వేత, కూరాకుల నాగభూషణం, రాయల శేషగిరిరావు, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ సింగ్, బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.