బోనకల్లు, జూన్ 29 : మధిరలో డిప్యూటీ సీఎం షాడోలు పరిపాలన చేస్తున్నారని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. ఆదివారం బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 19 నెలలు అయినప్పటికీ ప్రజలకు ఒరిగిన ప్రయోజనం శూన్యం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 90 రోజుల్లో 420 హామీలు అమలు చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. ఈ హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, విమర్శించినా వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో రాసిచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా మహా టీవీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై వ్యక్తిగతంగా ఆరోపణ చేస్తూ ప్రచారం చేయడం దారుణం అన్నారు. వీటిని తిప్పికొట్టేందుకు వ్యవహరిస్తున్న సోషల్ మీడియాపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారన్నారు. పోలీస్ అధికారులు వాస్తవాలను పరిశీలించి కేసులు నమోదు చేయాలే తప్పా కాంగ్రెస్ నాయకులు చెప్పారు కదా అని కేసు నమోదు చేస్తే రాబోవు రోజుల్లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
ఈ సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ బానోత్ కొండ, రైతు బంధు మాజీ కన్వీనర్ వేమూరు ప్రసాద్, నాయకులు గద్దల వెంకటేశ్వర్లు, పారా ప్రసాద్, జెర్రిపోతుల రవీందర్, వంగాల కృష్ణ, గొల్లమందల రాజారావు, ఏడుకొండలు, అనంతరామయ్య పాల్గొన్నారు.