ఖమ్మం, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో ఖమ్మం జిల్లా ప్రగతి పథంలో ముందు భాగాన ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రతి లబ్ధిదారుడికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలన్నదే లక్ష్యమని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.
ఖమ్మంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు హాజరయ్యారు. ముఖ్య అతిథి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్రం కోసం జీవితాలను త్యాగం చేసిన మహనీయులకు జోహార్లు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.
ప్రభుత్వ పథకాల ఫలాలను అర్హులందరికీ అందించి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తున్నామని అన్నారు. ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోందన్నారు. జిల్లాలో నీటి పారుదల రంగానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో రైతులకు ఆధునిక పద్ధతులను అలవర్చి వారు ఆర్థిక పురిపుష్టి సాధించే విధంగా జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు.
అనంతరం విధి నివహణలో ప్రతిభ కనబర్చిన అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందించారు. స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించారు. విద్యార్థుల కళాప్రదర్శనలు తిలకించారు. మైదానంలో ఏర్పాటుచేసిన సాళ్లను సందర్శించారు. ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, కలెక్టర్ అనుదీప్, ఇతర అధికారులు ప్రసాదరావు, డాక్టర్ శ్రీజ, శ్రీనివాసరెడ్డి, అభిషేక్, సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్, దీక్షారైనా తదితరులు పాల్గొన్నారు.