కొత్తగూడెం గణేష్ టెంపుల్, మే 12 : జిల్లాలోని ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈవో వెంకటేశ్వరాచారి తెలిపారు. కొత్తగూడెంలో సోమవారం ఆయన శిక్షణ తరగతుల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 4,159 మంది ఉపాధ్యాయులకు ఐదు రోజుల చొప్పున మూడు విడతలుగా జిల్లా, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.
రిసోర్స్ పర్సన్లుగా 48 మంది ఉపాధ్యాయులు ఇప్పటికే శిక్షణ పొందారని, వీరు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో 10, ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు ప్రతీ మండల కేంద్రంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇన్చార్జిలుగా ఆయా పాఠశాల హెచ్ఎంలను నియమించామని తెలిపారు. మండలస్థాయిలో ఇన్చార్జిలుగా ఎంఈవోలు వ్యవహరిస్తారని, శిక్షణకు హాజరయ్యే ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజన సౌకర్యం ఉంటుందని, ఉదయం 9.30 గంటలకు కేంద్రాలకు చేరుకోవాలని, సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు.