ఖమ్మం రూరల్, జూన్ 6 : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించిందని, వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈవో సామినేని సత్యనారాయణ అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి నాయుడుపేట పాఠశాలలో బడిబాట, అంగన్వాడీ బాట కార్యక్రమాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఆయా కార్యక్రమాలకు సీడీపీవో కమలప్రియ, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డితో కలిసి డీఈవో హాజరయ్యారు. తొలుత విద్యార్థుల తల్లిదండ్రులతో వారు ముఖాముఖి మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాల నిర్వహణ తీరుపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బడిబాటకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంచి మార్కులు రావడం సంతోషంగా ఉందన్నారు. వేలకు వేలు పెట్టి అప్పుల పాలు కాకుండా మంచి ఫలితాలు సాధిస్తున్న ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్, హెచ్ఎం సుధారాణి, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం శ్యాంసన్, అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.