ఖమ్మం జిల్లాను డెంగీ వణికిస్తోంది. ఇంట్లో ఒక్కరికి వచ్చిన జ్వరం.. తరువాత ఆ ఇంట్లో ఉన్న అందరినీ మంచాన పడేస్తోంది. జిల్లాలో డెంగీ పాజిటివ్ కేసుల సంఖ్య 400 మార్క్‌కు చేరువ కావడం ప్రతి ఒక్కరినీ వణికిస్తోంది. ఇవి కేవలం అధికారిక లెక్కలు మాత్రమే. ప్రైవేట్ దవాఖానల్లో నమోదయ్యేవి, అధికారులు దాచి పెడుతున్నవి పరిగణనలోకి తీసుకుంటే ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది.
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం సిటీ, ఆగస్టు 25: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరల్, డెంగీ, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా పారిశుధ్యం పడకేయడంతో సీజనల్, విష జ్వరాలు ప్రజలను చుట్టుముడుతున్నాయి. ఇంటికి ఒకరిద్దరు చొప్పున జ్వర పీడితులు మూలుగుతున్నారు.
ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 400, భద్రాద్రి జిల్లాలో 130 చొప్పున డెంగీ కేసుల నమోదు కావడం జిల్లాలో జ్వరాల తీవ్రతకు అద్దం పడుతోంది. జ్వరాల విజృంభణతో జ్వరపీడితులందరూ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు ఆసుప్రతులు.. రక్త పరీక్షల పేరుతో రోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. అయితే జ్వరాలు విజృంభిస్తున్న ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలో నలుగురు, పల్లెగూడెంలో కేవలం మూడు రోజుల్లో ఇద్దరు, ఎర్రుపాలెంలో ఒకరు, బోనకల్లు మండలం ఆళ్లపాడు మరొకరు డెంగీ, విష జ్వరాలతో ఇటీవలే మృత్యువాతపడ్డారు. ఆయా ప్రాంతాల్లోనే కాదు.. ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లోనూ గడిచిన కొద్ది రోజులుగా జ్వరాల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్షాల సీజన్ ఆరంభం నుంచే జ్వరాలు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా డెంగీ పంజా విసురుతోంది.
జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. మునుపెన్నడూ లేని విధంగా పెద్ద వయస్కుల నుంచి చంటి పిల్లల వరకూ వయసుతో సంబంధం లేకుండా విష జ్వరాల భారిన పడుతూ కానరాని లోకాలకు వెళుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు విలవిల్లాడుతున్నారు. కేవలం దోమ కాటు కారణంగా జిల్లాలో మరణ మృదంగం మోగుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
భద్రాద్రి జిల్లాలో మొన్నటిదాకా వర్షాలు దంచికొట్టాయి. ఆ తరువాత వరదలూ ముంచెత్తాయి. వెరసి గ్రామాల్లో చెత్తకుప్పలు పేరుకపోయాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమా అని పారిశుధ్యం పూర్తిగా పడకేసింది. దీంతో జ్వరాల విజృంభణ జోరందుకుంది. ప్రధానంగా విష జ్వరాల భారినపడుతున్న రోగులు.. ముఖ్యంగా కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. జ్వర పీడితుల క్యూలతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి.
ప్రభుత్వాసుపత్రుల సిబ్బంది రోగులను సరిగా పట్టించుకోకపోవడం, సగం మందులను బయటకు రాస్తుండడం, కొన్ని పరీక్షలు లేవని చెబుతుండడం వంటి కారణాలతో చాలా మంది రోగులు ప్రైవేటు ఆసుపత్రుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు వైద్యులు వివిధ రకాల రక్త పరీక్షల గంట గంటకూ రక్త నమూనాలు తీసుకుంటున్నారు. అందుకు అధిక ఫీజులతో రోగులను పీల్చిపిప్పిచేస్తున్నారు. జిల్లాలో అధికారికంగా ఇప్పటికే 130 డెంగీ కేసులు, 71 మలేరియా కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అలాగే, అన్ని ఆసుపత్రుల్లోనూ డెంగీ, మలేరియా పీడితులకే అధికశాతం బెడ్లను కేటాయిస్తున్నారు.
నిన్నా మొన్నటి దాకా వర్షాలు దంచి కొట్టిన నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్యం లోపించింది. ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం, ప్రత్యేకాధికారులను నియమించి చేతులు దులుపుకోవడం వంటి కారణాలతో పారిశుధ్యం పూర్తిగా పడకేసినట్లయింది. జ్వరాల విజృంభణకు ఇదే ప్రధాన కారణంగా నిలుస్తోంది. కొన్ని గ్రామాల్లో మంచినీటి పైపులైన్లు మురుగు కాల్వల్లో పడుతున్నాయి.
ఫలితంగా తాగునీళ్లు కలుషితమవుతున్నాయి. జ్వర పీడితుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో ప్రైవేటు ల్యాబ్‌ల యాజమాన్యాలు వాటిని 24 గంటలూ తెరిచే ఉంచుతున్నారు. కొన్నిచోట్ల ప్లేట్లెట్లు పడిపోతున్నాయంటూ కొన్ని ల్యాబ్‌లు రిపోర్టులు ఇస్తుండడంతో రోగులు భయంతో వణికి పోతున్నారు.
వైరా టౌన్, ఆగస్టు 25: వైరాలోని శాంతినగర్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి జ్వరంతో మృతిచెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వైరాకు చెందిన అక్బర్, నూర్జహాన్ దంపతుల రెండో కుమార్తె సిద్దిక్ (5) రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని మరో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చిన్నారి అక్కడ చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి శనివారం మృతిచెందింది.
ఖమ్మం జిల్లాలో డెంగీతోపాటు విష జ్వరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాస్థాయిలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చైర్మన్‌గా వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. రోజువారీగా జ్వర సర్వే చేస్తున్నాం. దోమల విజృంభించకుండా చర్యలు తీసుకుంటున్నాం. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నాం.
-డాక్టర్ వరికూటి సుబ్బారావు, డీఎంహెచ్‌వో, ఖమ్మం
జిల్లా అంతటా వైరల్ జ్వరాలు ఉన్నాయి. పీహెచ్‌సీల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. డెంగీ టెస్టులు ప్రైవేటులో చేయకూడదు. ఎలీసా టెస్టు ద్వారా మాత్రమే డెంగీ పరీక్ష చేయాలి. అయితే ప్లేట్లెట్స్ పడిపోయినంత మాత్రాన డెండీ కాదు. పారిశుధ్య లోపం వల్లే వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ సీజన్లో ప్రతిసారీ జ్వరాలు వస్తూనే ఉంటాయి. వేడిచేసి చల్లార్చినవి నీటినే తాగాలి. జాగ్రత్తలు పాటించాలి.’
-డాక్టర్ భాస్కర్‌నాయక్, డీఎంహెచ్‌వో, భద్రాద్రి