ఎస్సీలు ఆర్థిక స్వావలంబన సాధించాలని, వారి అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ‘దళిత బంధు’ పథకంపై ఆయన ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో దళితబంధు అమలుకు కసరత్తు జరుగుతున్నదన్నారు.
వచ్చే నెల మొదటివారం నాటికి లబ్ధిదారులను ఎంపిక చేసి, యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారని పేర్కొన్నారు. ఈ మండలంలో 4,500 కుటుంబాలు దళిత బంధు పథకానికి ఎంపిక చేశామని, ప్రభుత్వం రూ.450 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. తొలి విడతలో ఇప్పటికే రూ.100 కోట్లను కలెక్టర్ అకౌంట్లో జమ చేసినట్లు చెప్పారు. మండలంలో ప్రతి గ్రామానికి ఒక జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించామని పేర్కొన్నారు. అన్ని ్రగ్రామాల్లో కమిటీల నియామక ప్రక్రియ పూర్తయిందన్నారు.
ఖమ్మం, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇతర రాష్ర్టాలూ ఆ పథకాలను అనుసరిస్తున్నాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. దళిత బంధు పథకంపై ఆయన ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో పథకం అమలుపై పలు అంశాలను వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. ఎస్సీల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. పథకం తొలుత మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం ఎంపికైందన్నారు. దళితబంధు పథకం అమలుకు ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు రూ.550 కోట్లు కేటాయించిందన్నారు. ఆ ఇంటర్వ్యూ పూర్తి పాఠం పాఠకుల కోసం..
పువ్వాడ : ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో దళితబంధు అమలుకు కసరత్తు జరుగుతున్నది. ఉభయ జిల్లాల కలెక్టర్లు పథకాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. వచ్చే నెల మొదటివారం నాటికి ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక పూర్తవుతుంది. యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తికానుంది.
మండలం : చింతకాని మండలంలో 4,500 కుటుంబాలు దళిత బంధు పథకానికి ఎంపికయ్యాయి. మొత్తం రూ.450 కోట్ల నిధులను కేటాయించింది. తొలి విడతలో ఇప్పటికే రూ.100 కోట్లను కలెక్టర్ అకౌంట్లో జమ చేసింది. మండలంలో ప్రతి గ్రామానికి ఒక జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాం. అన్ని గ్రామాల్లో కమిటీల నియామకమూ పూర్తయింది.
మంత్రి : పథకానికి ఎంపికైన లబ్ధిదారులు ఆసక్తి ఉన్న రంగాలు, తమకు ఇష్టమైన రంగాల్లో స్వేచ్ఛగా యూనిట్లు నెలకొల్పే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో ఎక్కడైనా యూనిట్ ఏర్పాటు చేసుకునే సౌలభ్యం పథకంలో ఉన్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లబ్ధిదారులు ఎలాంటి యూనిట్లు పెడితే బాగుంటుంది. ఏ యూనిట్‌కు మార్కెట్లో డిమాండ్ ఉంది.. అనే అంశాలపై జిల్లా పరిశ్రమల, వ్యవసాయశాఖ పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాయి. వ్యవసాయ రంగంలో అనేక యూనిట్లు నెలకొల్పేందుకు అవకాశం ఉందని గుర్తించాం. వాటిపై అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు.
మంత్రి : చింతకాని మండలంలో ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక జిల్లా అధికారి, జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పది మంది ప్రత్యేక అధికారులను నియమించింది. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు ఎంపిక చేసిన జాబితా ఆధారంగా అధికారులు పథకంలో భాగంగా ఉపాధి యూనిట్ల గ్రౌండింగ్‌కు చర్యలు తీసుకోనున్నారు.
మంత్రి : లబ్ధిదారులను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తారు. తొలిదశలో ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాల ఎంపిక ఉంటుంది. అందుకు ప్రతి నియోజకవర్గంలో పూర్తిగా ఒక గ్రామం ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎమ్మెల్యేలు ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక పనుల్లో నిమగ్నమయ్యారు.
మంత్రి : దళితబంధు పథకానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రభుత్వం ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షలు మంజూరు చేస్తుంది. ఈ సొమ్ముతో ఒక్క యూనిటే కాకుండా ఇద్దరు, ముగ్గురు లబ్ధిదారులు కలిసి పెద్ద యూనిట్ పెట్టుకునే సౌలభ్యం ఉన్నది. లేదా తొలి విడతగా చిన్న యూనిట్ ఏర్పాటు చేసుకుని తర్వాత విస్తరించుకునే అవకాశం ఈ పథకంలో ఉన్నది. దీంతో లబ్ధిదారులకు తాము ఎంచుకున్న ఉపాధి రంగంలో అభివృద్ధి సాధించే వెసులుబాటు ఉంటుంది.