ఖమ్మం రూరల్ : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ప్రభావం బుధవారం యావత్ ఖమ్మం జిల్లాపై స్పష్టంగా కనపడింది. మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలలో తెల్లవారుజాము నుంచి రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. అనంతరం ఓ మోస్తారు వర్షం కురుస్తుంది. ఈ వర్షం ప్రభావంతో ఖమ్మం రూరల్ మండలంలోని అనేక గ్రామాలలో వానాకాలం సాగు చేపట్టిన పత్తి, వరి పంట ఇటీవల వేసిన మిర్చి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే వరుస వర్షాలతో పత్తి చేలు ఊటబట్టి పోగా దిగుబడి పూర్తిగా తగ్గింది. ఈ తరుణంలో చేతికి వచ్చిన పంటను తీసే క్రమంలో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు వాన ముసురు కురుస్తుండటంతో పండిన పంట సైతం చేతికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీనికి తోడు వానాకాలం సాగుచేసిన వరి పొలాలు కోతకు వచ్చే దశలో భారీ వర్షం రావడంతో అనేక గ్రామాలలో వరి పంట నేలకు ఒరిగింది. పంట ఎన్నులు కింద పడిపోవడంతో కాపాడుకోవడం కష్టమని రైతులకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి ఇలా ఉండగా ఇటీవల వేసుకున్న మిర్చి మిర్చి తోటలోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో తోటలను కాపాడుకోవడం కష్టమైందని రైతులు పేర్కొంటున్నారు. దీంతో వానాకాలం సాగు చేపట్టిన ప్రతి పంట వర్షం పాలైందని చెప్పొచ్చు. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పడమటి తండా గ్రామాల్లోని పలు ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో సదరు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పాలు పడ్డాయి రోజంతా వర్షం కురిసే అవకాశం ఉన్నందున పత్తి రైతులు ఖమ్మం మార్కెట్కు పంటలు తీసుకురావద్దని అధికారులు ప్రకటించారు.
పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మున్సిపాలిటీ పరిధిలో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలవాలని తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడంతో మున్సిపల్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. మరో 24 గంటల పాటు వాన ఉండే అవకాశం ఉందని రైతులు తీసిన పంటలు కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. గడిచిన 24 గంటల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 132.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఖమ్మం రూరల్ మండలంలో 64.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నేడు రేపు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజల అపమాత్రంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని జలాశయాల పక్కకు ప్రయాణాలు చేయవద్దని కలెక్టర్ సూచించారు.