కొత్తగూడెం క్రైం, అక్టోబర్ 26 : దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరువీరుల త్యాగాలను మరువొద్దని, వారి త్యాగాల చరిత్రను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా లక్ష్మీదేవిపల్లి నుంచి కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ మీదుగా రుద్రంపూర్ వరకు శనివారం నిర్వహించిన సైకిల్ ర్యాలీలో కలెక్టర్ పాటిల్, ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు ముఖ్యతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తుల నుంచి ప్రజలను కాపాడుతూ ఎంతో మంది జవాన్లు, పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారని అన్నారు. వారి త్యాగాలు చిరస్మరణీయమన్నారు. ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులను ఎప్పటికీ మరువకూడదన్నారు. వారి త్యాగాలను స్మరిస్తూ ఏటా అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి కిష్టాగౌడ్, ఓఎస్డీ టి.సాయిమనోహర్, డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు మడిపెల్లి నాగరాజు, చెన్నూరి శ్రీనివాస్, చుంచుపల్లి సీఐ రాయల వెంకటేశ్వర్లు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్లు ముప్పారపు కరుణాకర్, టి.రమేశ్, కాగితోజు శివప్రసాద్, జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఆర్ఐలు బోలెం రవి, సుధాకర్, కృష్ణారావు, ఎస్సైలు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.