చండ్రుగొండ, సెప్టెంబర్ 14 : ఎకరం పోడు భూమిలో ఓ గిరిజన రైతు సాగు చేసిన పత్తి పంటను అటవీ శాఖ అధికారులు పీకివేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బాలియాతండాలో శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. పోకలగూడెం పంచాయతీ పరిధిలోని బాలియాతండాకు చెందిన భూక్యా మిట్టు తనకున్న పోడు భూమి(పట్టా కలిగినది) మూడున్నర ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. అటువైపు కొన్నాళ్లుగా అటవీ శాఖ అధికారులు రావడంతోపాటు రైతు వేసిన పంటలను పరిశీలించేవారు.
ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున అటవీ శాఖ అధికారులు తమ సిబ్బందితో వచ్చి సుమారు ఎకరం భూమిలో పత్తి పంటను పీకివేశారు. ఆ మొక్కలు కూడా దరిదాపుల్లో కనిపించకుండా తమతోపాటే తీసుకెళ్లారు. అయితే రోజువారీగా ఉదయం చేను వద్దకు వెళ్లిన రైతు మిట్టు కుటుంబ సభ్యులు పత్తి మొక్కలు తొలగించిన భూమిని చూసి ఆందోళన చెందారు. పంట భూమిలో మిగిలిన పత్తి మొక్కలను పట్టుకొని నిరసన తెలిపారు. తనకు గత కేసీఆర్ ప్రభుత్వంలోనే పోడు పట్టా వచ్చిందని, ఇప్పుడు అధికారులు మా పంటను ఎందుకు ధ్వంసం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని బాధిత రైతు తెలిపాడు.
పోడు రైతు తన వద్ద ఉన్న పోడు పట్టాను తీసుకొచ్చి చూపిస్తే పంట ధ్వంసం చేసిన విషయాన్ని పరిశీలిస్తాం. పంట ధ్వంసం విషయం నాకు ఇప్పుడే తెలిసింది. కొత్తగా పోడు నరికితే ఎంతటివారైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. అడవుల సంరక్షణ అందరి బాధ్యత.