ఖమ్మం, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి పంట ఇంటికొచ్చింది.. వానకాలం పంటకు సాగు భూములు సిద్ధం చేయడానికి సన్నద్ధమవుతున్న రైతులు యాసంగి పంట ఆనవాళ్లను ఆ భూములోనే వేసి కలియ దున్నాల్సిందిపోయి.. పంట అవశేషాలను పోగు చేసి నిప్పు పెడుతున్నారు. ఇలా నిప్పు పెట్టడం వల్ల అవశేషాలు కాలిపోవడంతోపాటు భూసారంపై ప్రభావం పడుతుంది. వేడికి భూమిలో ఉన్న క్రిమికీటకాలు, పంటకు శక్తినిచ్చే సారం దెబ్బతింటుంది. ఈ క్రమంలో తదుపరి సాగు చేసే పంటలకు భూమి శక్తిని ఇవ్వకపోవడంతో ఆ ప్రభావం దిగుబడులపై పడుతుంది. వేసిన పంట ఎదుగుదల లేకపోవడం.. తరచూ తెగుళ్లు ఆశించడం వల్ల క్రిమిసంహారక మందులు, ఎరువులు చల్లడమే పనిగా పెట్టుకోవాల్సి వస్తుంది.

వీటన్నింటి వల్ల రైతులపై పెట్టుబడి భారం పెరిగి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే పంట సీజన్ ముగిసిన తర్వాత అవశేషాలను కాల్చొద్దని.. అదే భూమిలో వేసి కలియదున్నితే వర్షాలకు మురిగిపోయి ఆ భూమి సారవంతమవుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా.. పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. పొద్దంతా పోగు చేసిన పంట అవశేషాలకు రైతులు నిప్పు పెట్టడం వల్ల గాలికి మంటలు వ్యాప్తి చెంది పెను ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

నిప్పు పెట్టిన రైతులు ఆ తర్వాత దానిని ఆర్పకపోవడంతో నెమ్మదిగా విస్తరించి పక్కనే ఉన్న విద్యుత్ తీగలు, మోటర్లు, కల్లాల్లో ఉన్న ఇతర రైతుల పంట ఉత్పత్తులు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం, జామాయిల్, మామిడి తోటలు, ఈత వనాలు దగ్ధమవుతున్నాయి. రోడ్ల వెంట ఉన్న పచ్చని చెట్లు కాలి బూడిదవుతున్నాయి. ఇక సమీప గ్రామాలకు కూడా మంటలు వ్యాప్తి చెంది పెను ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. చిన్న తప్పిదంతో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు పంట అవశేషాలు కాల్చడం ద్వారా ఇటీవలి కాలంలో పెను ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నిత్యం ఏదో ఒకచోట మంటలు అంటుకొని నష్ట తీవ్రత పెరుగుతున్నా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు.

పంట అవశేషాలను కాల్చడం వల్ల భూసారం తగ్గిపోవడంతోపాటు పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుంది. వేసవి వడగాలుల దృష్ట్యా చిన్న మంటలు కూడా భారీ అగ్ని ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంది. రైతులు వరి, మొక్కజొన్న కొయ్యలను కాల్చకుండా యంత్రాల ద్వారా నేలలో కలియదున్నడం లేదా పశువుల మేతగా వినియోగించడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలి. ఇప్పటికే పలుచోట్ల ధాన్యం రాశులు, జామాయిల్ తోటలు దగ్ధమయ్యాయి. పంట అవశేషాలను కాల్చితే గ్రామ పంచాయతీ నుంచి రూ.5 వేల జరిమానా విధిస్తాం. పంట అవశేషాలను ఒక గొయ్యి తీసి అందులో వేస్తే వర్షాలకు తడిసి ఎరువులా మారుతుంది. తర్వాత దానిని పంటలకు వినియోగించుకోవచ్చు.
-డి.పుల్లయ్య, ఖమ్మం జిల్లా వ్యవసాయాధికారి
పంట కాలం పూర్తయిన తర్వాత వాటి అవశేషాలు, వ్యర్థాలను కాలబెట్టడం వల్ల నేల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. గాలి కాలుష్యం పెరిగి పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. సాగులో ఉపయోగకరంగా ఉండే సూక్ష్మ జీవులు నశించిపోయి భూమి సారవంతం కోల్పోతుంది. కార్బన్ డయాక్సైడ్ వంటి హానికర వాయువులు వాతావరణ మార్పునకు కారణమవుతాయి. ఒక వర్షం కురిసిన తర్వాత పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలియ దున్నాలి. లేదా పశువులకు మేతగా, సేంద్రియ ఎరువుల తయారీకి వినియోగించుకోవచ్చు. పంట అవశేషాల నిర్వహణ వల్ల నేల ఆరోగ్యం, సేంద్రియ పదార్థం మరింతగా పెరుగుతుంది. దీనివల్ల నేలలో తేమ నిల్వ ఉండి సూక్ష్మ జీవుల అభివృద్ధి మెరుగుపడుతుంది. నేల సారవంతమవుతూ ఎరువుల వినియోగం తగ్గుతుంది. రైతులు కనీస అవగాహనతో పంట అవశేషాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చొద్దు.
-డాక్టర్ టి.భరత్, సీనియర్ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి జిల్లా