పంట పండించే రైతులపై ప్రకృతి పగబట్టింది. పంట వేసినప్పటి నుంచి సాగునీరు అందక.. తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుకుంటూ వస్తున్నా తీరా చేతికొచ్చే సమయంలో పరీక్ష పెడుతున్నది. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం వరి, మిర్చి, మొక్కజొన్న పంటలను నేలపాలు చేసి అపార నష్టాన్ని మిగిల్చింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు కురిసిన వర్షంతో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి, ధాన్యం తడిసిముద్దయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో రాత్రి పూట ఒక్కసారిగా వర్షం కురవడంతో రైతులు ఆరబెట్టిన ధాన్యం, మిర్చి పంటలపై టార్పాలిన్లు కప్పుకునేందుకు నానా అవస్థలు పడ్డారు.
కోత దశలో ఉన్న వరి, ఏరే దశలో ఉన్న మిర్చి చేలల్లోనే తడిసిపోయాయి. పలుచోట్ల వడ్లు రాలి నీటిపాలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామునే పంట పొలాలు, కల్లాల వద్దకు చేరుకున్న రైతులు వాటిని చూసిన కన్నీరు పెట్టుకున్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే అకాల వర్షం అపార నష్టాన్ని తెచ్చిపెట్టిందని ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
-నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 4
చర్ల, ఏప్రిల్ 4: మండలంలోని పలు గ్రామాల్లో రైతులు కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి అకాల వర్షంతో తడిసిపోయింది. అసలే గిట్టుబాటు ధర లేక దిగులు చెందుతున్న రైతులపై అకాల వర్షం మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు చేసింది. వర్షానికి మిర్చి పంట తడవడంతో మార్కెట్లో ధర కూడా పలకదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తడిసిపోయిన మిర్చి పంటను ఆరబెట్టే పనిలో రైతులు నిమగ్నమయ్యారు.
నా పేరు బట్టా నవీన్. నేను ఈ యేడాది ముమ్మడివరం గ్రామంలో 20 ఎకరాల్లో మిర్చి పంట వేశాను. ఎకరానికి రూ.2 లక్షల వరకు ఖర్చు అయింది. తెగుళ్లతో పంట దిగుబడి తగ్గింది. మార్కెట్లో క్వింటా రేటు రూ.10 వేల వరకు ఉంది. ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. అంతేకాక తోటలో ఏరిన మిర్చిని కల్లంలో ఆరబెట్టాను. బరకాలు కప్పినా అకాల వర్షంతో మిర్చి తడిచింది. కాయ రంగుమారే ప్రమాదం ఉంది. దీనికి మార్కెట్లో పెద్దగా రేటు పలకదు. ఏం చేయాలో తోచడం లేదు. ఈ యేడాది కనీసం రూ.3 లక్షల వరకు నష్టం వచ్చేలా ఉంది.
టేకులపల్లి, ఏప్రిల్ 4: అకాల వర్షం కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పంటను ముద్ద చేసింది. టేకులపల్లి, కోయగూడెం, సులానగర్, ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు, కొత్తతండా, బోడు, సంపత్‌నగర్, బేతంపూడి, తొమ్మిదోమైలుతండా తదితర గ్రామాల్లో ఏరిన మిర్చి పంటను కల్లాల్లో ఆరబెట్టడంతో వర్షంతో తడిసిపోయింది. ఎండబెట్టిన మిర్చిని కాపాడుకునేందుకు టార్పాలిన్లు కప్పి రైతులు నానా పాట్లు పడ్డారు. కొన్నిచోట్ల చేతికొచ్చిన మొక్కజొన్న తడిసిపోయింది. శుక్రవారం ఉదయం నుంచి టార్పాలిన్లపై నిలిచిన నీటిని తొలగించే పనిలో పడ్డారు. తడిసిన పంటను ప్రభుత్వమే కొనాలని, పరిహారం అందించాలని కోరారు.
దుమ్ముగూడెం, ఏప్రిల్ 4: మండలంలో గురువారం రాత్రి ఈదురు గాలులతో అకాల వర్షం కురిసింది. ఇప్పటికే కోత కోసిన వరి పంట రంగుమారుతుందని రైతులు దిగులు చెందుతున్నారు. కోతకొచ్చిన పంట నేలవాలడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మళ్లీ వర్షం వస్తే వరికి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి సైతం తడిసిపోయిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
వైరా టౌన్, ఏప్రిల్ 4: అకాల వర్షం కారణంగా వైరా మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో రైతులకు అపార నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి, మొక్కజొన్న గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా తడిచిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు సర్వే నిర్వహించి రైతుకు నష్టపరిహారం అందించాలని వేడుకున్నారు.
చండ్రుగొండ, ఏప్రిల్ 4: గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు కురిసిన అకాల వర్షం మిర్చి రైతులను కోలుకోకుండా చేసింది. కల్లాల్లో ఆరబెట్టిన మిరప కాయలు తడిసిపోయాయి. కొన్నిచోట్ల పరదాలు కప్పి పంటను కాపాడుకున్నారు. వర్షంతోపాటు గాలులు వీచడంతో తోటలో చెట్లపై ఉన్న కాయలు రాలిపోయాయి. వాటిని చూసిన రైతులు లబోదిబోమంటున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను అధికారులు సర్వే చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
తిరుమలాయపాలెం, ఏప్రిల్ 4: మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా వర్షం కురిసింది. మండలంలోని తిరుమలాయపాలెం, వెదుళ్లచెరువు, పిండిప్రోలు, కొక్కిరేణి, తెట్టెలపాడు, దమ్మాయిగూడెం, పాపాయిగూడెం గ్రామాల్లో కురిసిన వర్షానికి.. కల్లాల్లో ఆరబోసిన మిర్చి, మొక్కజొన్నలు తడిచిపోయాయి. దీంతో రైతులందరూ పరుగున వెళ్లి మిర్చి రాశులు, మొక్కజొన్న రాశుల మీద పరదాలు కప్పారు.
పెనుబల్లి, ఏప్రిల్ 4: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం రాత్రి నుంచి ఒక్కసారిగా వర్షం కురవడంతో రైతులు అయోమయానికి గురయ్యారు. మండాలపాడులో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పంటను కాపాడుకునేందుకు టార్పాలిన్లు కప్పేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. తాళ్లపెంట, సూరయ్య బంజరతండాలో చేతికొచ్చిన వరి పైర్లు నేలకొరిగాయి. లంకపల్లి, కొత్తకారాయిగూడెం, పాతకారాయిగూడెం, గోండ్రుపాడు, టేకులపల్లి గ్రామాల్లో వరి పంటలు కోయడంతో నీటిలో తడిసి ముద్దయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి మిర్చి, వరి పంటలను ఆరబెట్టుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు.
పాల్వంచ రూరల్, ఏప్రిల్ 4: మండలంలోని తోగ్గూడెం, తోగ్గూడెంతండాల్లో వీచిన బలమైన గాలులు, వర్షానికి కొన్నిచోట్ల వరి పనలు నేలకొరిగాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో పెట్టుబడి అంతా నీటిపాలైందని, పంట కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలని మదనపడుతున్నారు. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పంట కూడా తడిసిపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు.
అన్నపురెడ్డిపల్లి, ఏప్రిల్ 4: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షం, ఈదురు గాలులకు వరి పైరు నేలకొరిగింది. మర్రిగూడెం, అబ్బుగూడెం, రాజాపురం, ఊటుపల్లి, పెంట్లం గ్రామాల్లో వరి పైరు వర్షాలకు దెబ్బతిన్నది. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కళ్లముందే దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.