నమస్తే నెట్వర్క్, మే 3: ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఆదివారం నాటి అకాలవర్షానికి పంటలు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం రాశులపై పట్టాలను కప్పుకోవడం కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బలమైన ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఈదురుగాలులు మొదలు కావడంతోనే ఖమ్మం జిల్లాలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గంటలు గడిచినా పునరుద్దరించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కూసుమంచి, ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన పడింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన వరి ధాన్యం, మక్కలు తడిసి ముద్దయ్యాయి. సూర్యాపేట- ఖమ్మం జాతీయ రహదారిపై వేలాది క్వింటాళ్ల ధాన్యం, మక్కలు నీటి పాలయ్యాయి. మామిడితోటల్లో మామిడికాయలు నేలరాలాయి. చేతికి అందిన పంట కళ్ల ముందే తడిసిపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..
భద్రాద్రి జిల్లా కరకగూడెంలో ప్రధాన రహదారిపై చెట్లు నేలకొరిగి రవాణాకు అంతరాయం కలిగింది. విపరీతమైన గాలికి అనంతారం గ్రామంలో రహదారిపై నిలిపిన ద్విచక్రవాహనాలు సైతం కిందపడి కొంతదూరం కొట్టుకపోయాయి. అనంతారం, కరకగూడెం, పద్మాపురం, గొల్లగూడెం గ్రామాల్లో ఇంటిపై కప్పులు ఎగిరిపోయాయి. కరకగూడెం మండల కేంద్రం నుంచి ద్విచక్రవాహనంపై మొగిలితోగు గ్రామానికి వెళ్తున్న కొమరం నరసింహారావుపై పద్మాపురం సమీపంలో చెట్టుకొమ్మ విరిగి తలపై పడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే స్థానికులు చెట్టుకొమ్మలను తొలగించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పినపాక మండలంలోని గోపాలరావుపేట, కిష్టాపురం, జానంపేట, తోగ్గూడెం గ్రామాల్లో గాలి దుమారానికి విద్యుత్ స్తంభాలు నేలకూలగా, ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. కారేపల్లి మండలం మాదారం కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న బస్తాలు తడిచిపోయాయి.

ప్రభుత్వంపై అన్నదాత ఆగ్రహం..
గత 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం, మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు కనీసం బస్తాలు ఇవ్వలేదు. కంటాలు వేసి ధాన్యాన్ని తరలించలేదు. ఫలితంగా ఆదివారం ఆకస్మికంగా కురిసిన వర్షానికి అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. ఇది ప్రభుత్వ పాపామేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంజిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లి క్రాస్‌రోడ్డు వద్ద సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిపై మొక్కజొన్న రైతులు ధర్నాకు దిగారు. మద్దులపల్లి మార్కెట్లో ఏర్పాటుచేసిన మక్కల కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్ల ప్రక్రియ ఆలస్యంకావడంతో ఆదివారం కురిసిన వర్షానికి భారీగా పంట తడిసిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. జోరు వర్షంలోనూ పక్కనే ఉన్న జాతీయరహదారిపై ధర్నా చేశారు. ప్రస్తుతం మద్దులపల్లి మార్కెట్‌యార్డులో సుమారు లక్ష బస్తాల మొక్కజొన్న ఉంది.

Khammam