ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, అక్టోబర్ 29 : తీరందాటిన మొంథా తుపాను ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం రాత్రి, బుధవారం రోజంతా భారీ వర్షం కురవడంతో చేతికొచ్చిన పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలు నీటమునిగాయి. కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న, వరి ధాన్యపు రాశులు తడిచి ముద్దయ్యాయి. కోతకొచ్చిన వరి పనలు నీటిలో నానుతున్నాయి. ఇదివరకు కురిసిన వర్షాలకు నిండుకుండలుగా మారిన జలాశయాలు ప్రస్తుత తుపాను ప్రభావంతో మళ్లీ అలుగుపోశాయి. చెరువులు, కుంటలు నిండిపోయి రోడ్లపైకి వరద చేరడంతో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. వరంగల్- ఖమ్మం మార్గంలో ఒకవైపు మాత్రమే ప్రయాణాలకు అనుమతి ఇస్తున్నారు.
పాపటపల్లి వద్ద బుగ్గవాగు పొంగి పొర్లడంతో పాపటపల్లి-వీఆర్ బంజరకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం నగరంలోని ప్రధాన డ్రైనేజీలు పొంగిపొర్లి రహదారులు చిన్నపాటి కుంటలను తలపించాయి. పాలేరు రిజర్వాయర్ 24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఖమ్మంలో మున్నేరు వాగు రాత్రి 11 గంటలకు 20 అడుగుల కు చేరింది. కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లి ఉపరితల గనులు జీవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీలలో 35 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వేస్టేషన్లో ట్రాక్‌పైకి వరద చేరడంతో కాకినాడ నుంచి షిరిడీ వెళ్లే షిరిడీ-సాయినగర్ ఎక్స్‌ప్రెస్ రైలును మధిరలోనే నిలిపివేశారు. 3 గంటల తర్వాత విజయవాడ మీదుగా ఆ రైలును దారి మళ్లించారు.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని నిమ్మవాగులో డీసీఎం వ్యాన్ కొట్టుకుపోగా.. డ్రైవర్ నీటిలో గల్లంతయ్యాడు. పలుచోట్ల రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షాలు కూలిపోవడంతో అధికారులు వాటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. కొండచరియలు విరిగిపడటంతో ముందస్తుగా ఏపీలోని అల్లూరి జిల్లా అధికారులు వాహనాలను అనుమతించడం లేదు. భద్రాచలం-రాజమండ్రి ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లా యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. ముందస్తుగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. నదీ పరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రదేశాలకు తరలించే ఏర్పాట్లు చేశారు.
మొంథా తుపాన్ ఖమ్మాన్ని ముంచెత్తింది. తీరం దాటిన తుపాన్ ఉమ్మడి ఖమ్మంజిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే చల్లనిగాలులు, జల్లులతో ప్రారంభమైన తుపాన్ భారీ వర్షానికి దారితీసింది. మొంథా తుపాన్ నేపథ్యంలో కలెక్టర్ ముందస్తుగా రెడ్అలర్ట్ ప్రకటన చేశారు. విద్యాసంస్థలకు సెలవు కూడా ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే అన్ని మండలాల్లో వర్షం పడింది. ఎడతెరపిలేకుండా కురిసిన వర్షంతో ఖమ్మం నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. బస్టాండ్ ప్రాంతంలో రోడ్లు చెరువులను తలపించాయి. ప్రధాన రహదారిపై మోకాళ్లలోతు నీళ్లు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. తుపాన్ కారణంగా జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. జిల్లావ్యాప్తంగా చెరువులు అలుగులు పోశాయి.
వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రహదారులన్నీ జలమయమై రాకపోకలు నిలిచిపోయాయి. కొన్నిచోట్ల చెట్లు నేలవాలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పాలేరు రిజర్వాయర్ పొంగిపొర్లింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భారీగా వరద పాలేరుకు చేరడంతో అధికారులు 24 గేట్ల ద్వారా నీటిని బయటకు వదిలారు. కొణిజర్ల మండలంలోని అంజనాపురం నిమ్మవాగు ఉధృతంగా ప్రవహించడంతో అటుగా వచ్చిన డీసీఎం వ్యాన్ వాగులో కొట్టుకుపోయింది. వ్యాన్ డ్రైవర్ మురళి గల్లంతయ్యాడు. మున్నేరు వాగుకు వరద భారీగా చేరుతుండటంతో ప్రవాహాన్ని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, ఖమ్మం నగరపాలక కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు.
బుధవారం రాత్రి 11 గంటలకు 20 అడుగులకు చేరింది. మరో రెండు అడుగులకు చేరితే వరద ప్రవాహం కాలనీని తాకే అవకాశం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఖమ్మంరూరల్ మండలం రామ్‌లీల ఫంక్షన్‌హాల్‌ను పునరావాస కేంద్రంగా సిద్ధం చేశారు. ఖమ్మంరూరల్ మండలం, తల్లాడ, రఘునాథపాలెం, కొణిజర్ల, మధిర, పాలేరు, తిరుమలాయపాలెం, కూసుమంచి, బోనకల్, చింతకాని మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న పంటలన్నీ నేలవాలాయి. ఇప్పటికే కురిసిన వర్షాలకు జిల్లాలో పత్తి పూర్తిగా పనికిరాకుండా పోయింది. మొంథా ప్రభావంతో చేతికొచ్చిన కూసింత దిగుబడి ఎందుకూ పనికిరాకుండా పోయిందని అన్నదాతలు అల్లాడిపోతున్నారు. భారీ వర్షం నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది.
మొంథా తుపాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అతలాకుతలం చేసింది. గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. పంటలు చేతికొచ్చే సమయానికి తడిసిపోవడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో భారీగా నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. చర్ల, దుమ్ముగూడెం, చుంచుపల్లి, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, ఇల్లెందు, సుజాతనగర్, అశ్వారావుపేట మండలాల్లో వరి పంట ఈనే దశలో ఉండగా నేలకొరిగిపోయింది. కొన్నిచోట్ల కోతకు వచ్చిన వరి పంట పూర్తిగా పాడైపోయింది. ఇక పత్తి రైతులకు ఆశలు లేకుండా పోయాయి. వర్షాలకు జనం బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఇల్లెందు, టేకులపల్లి, మణుగూరు, సత్తుపల్లి, కిష్టారం ఓసీల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగడంతో సంస్థకు భారీగానే నష్టం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అధికారుల అంచనా ప్రకారం 70వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది.