ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, నవంబర్ 1 : రైతులను ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది వానకాలం సీజన్ తొలినాళ్లలో తొలకరికి వర్షాలు కురవలేదు. జూన్, జూలై నెలల్లోనూ తీవ్రమైన ఎండలు కొట్టాయి. ఇక ఆ తరువాత మొదలైన వర్షాలు విరామం లేకుండా కురుస్తూనే ఉన్నాయి. కొన్నిరోజులు తెరిపివ్వడం.. రైతులు ఊపిరిపీల్చుకోగానే మళ్లీ కుండపోత.. మూడు నెలలుగా ఇదే తంతు. దీంతో పంటలు భారీగా దెబ్బతినడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా ‘మొంథా’ తుపాను విలయం సృష్టించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్నదాతలను నిండా ముంచింది. ఆరుగాలం కష్టించిన కర్షకులకు కన్నీటినే మిగిల్చింది. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పంటలను సాగుచేస్తే కష్టమంతా వర్షార్పణం అయ్యింది.
పంటలు చేతికొచ్చే సమయంలో ఎడతెరిపి లేని వానలు కురుస్తుండడంతో పత్తి, వరి, మిర్చి పంటలు పనికిరాకుండా పోయాయి. మొంథా తుపాను రైతులను కోలుకోకుండా చేసింది. తుపాను ప్రభావంతో ఖమ్మంజిల్లాలో 62,400 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,452 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనాను సిద్ధం చేశారు. అధికారిక గణాంకాలు ఇలా చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పంట నష్టం తీవ్రత ఎన్నో రెట్లు అధికంగా ఉంది. ఏదేమైనా చేతికొచ్చిన పంటలు కళ్ల ముందే తుడిచిపెట్టుకుపోతుండడంతో అన్నదాతలు గోడున విలపిస్తున్నారు.

గతేడాది మంచి ధర పలకడంతో ఈ ఏడాది ఖమ్మంజిల్లాలో 2,25,613 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. అయితే వరుస వర్షాల కారణంగా పత్తికాయలు లోపలనే కుళ్లిపోయాయి. కొద్దోగొప్పో పత్తికాయలు పగిలి బయటకు వచ్చినా పత్తి కూడా పూర్తిగా నల్లబడిపోయింది. జిల్లాలో 16,544 మంది రైతులకు సంబంధించి 22,574 ఎకరాల్లో పత్తిపంట నష్టం జరిగింది. మిర్చిపంట పరిస్థితీ ఇదే. భారీ వర్షాలకు తెగుళ్లు సోకడంతో మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. చేసేదిలేక కొందరు రైతులు మిరప పంటను తొలగించారు. మొంథా కారణంగా 2,234 మంది రైతులకు సంబంధించి 2,923 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి పంట పరిస్థితి సైతం ఇదే. అధిక వర్షాలకు నేలవాలిన వరి నీటి పాలైంది. ఇప్పుడు మొంథా దెబ్బకు 24,321 మంది రైతులకు చెందిన 36,893 ఎకరాల్లో వరిపంట నష్టం జరిగింది. ఇక పప్పు ధాన్యాలు 10 ఎకరాల్లో ఐదుగురు రైతులకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. పంట నష్టం అంచనా నివేదికను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలుస్తోంది.
పంట నష్టపోయిన తమను ఆదుకోవాలని బాధిత రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పత్తిని సాగు చేసేందుకు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టామని, తీరా పంట చేతికి అందే సమయానికి ఏకధాటిగా వస్తున్న వర్షాలు పంటలను ఎందుకూ పనికిరాకుండా చేస్తున్నాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

పంటల సాగు చేపట్టిన తొలినాళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా అన్నదాతలు అరిగోస పడ్డారు. అసలే కాలం ఆలస్యమైందని, దిగుబడి వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్న అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం చుక్కలు చూపింది. యూరియా విషయంలో నడ్డివిరిచింది. అసలే ఆలస్యంగా ఎదుగుతున్న పంటలకు అత్యవసరంగా వేయాల్సిన ఎరువులను కూడా ప్రభుత్వం సకాలంలో అందించలేదు.
దీంతో యూరియా కోసమే దాదాపుగా రెండు నెలలపాటు రైతులు ముప్పుతిప్పలు పడ్డారు. అంతలా అరిగోస పడి పంటలు కాపాడుకునే ప్రయత్నం చేసిన సమయంలో అకస్మాత్తుగా మొంథా తుపాను వచ్చి మొత్తానికే ముంచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాగవుతున్న 2,20,842 ఎకరాల పత్తిలో అధిక భాగం ఈ వర్షాలు, వరదలు, తుపానుల వల్లనే దెబ్బతిన్నది. తుపాను వచ్చిన మొదటిరోజే వ్యవసాయ శాఖ అధికారులు హడావిడిగా పైపైన సర్వే చేసి 1,452 ఎకరాల్లో మాత్రమే పంటలకు నష్టం జరిగినట్లు తేల్చారు. కానీ, వర్షాలు తగ్గిన తరువాత క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి సర్వే చేస్తే నష్ట తీవ్రతపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పత్తికి నష్టాన్ని అధికారులు తమ సర్వే నివేదికలో పొందుపర్చకపోవడం గమనార్హం.
మొంథా తుపాను వల్ల రైతులు తమ పంటలను తీవ్రంగా నష్టపోయినప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు పైపై సర్వేలు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. జాబితాను దగ్గర పెట్టుకున్న ప్రభుత్వం పరిహారంపై మౌనం వహిస్తోంది. పంటలు నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామంటూ పైపై పలుకులు పలికి చేతులు దులుపుకుంది. మొంథా తుపాను వల్ల భద్రాద్రి జిల్లాలో 1,452 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం జరిగిందని, అందులో 1,179 ఎకరాల్లో వరి, 273 ఎకరాల్లో మినుప పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు నివేదిక తయారు చేశారు. మిగతా పంటలు ఏ మేరకు నష్టపోయాయన్న లెక్కల జాడలేదు.
మొంథా తుపాను వల్ల మా పత్తి పంట బాగా దెబ్బతిన్నది. పత్తికాయలు నల్లరంగులో మారాయి. ఇప్పటికే యూరియా కోసం తిరిగితిరిగి పత్తి చేలకు సకాలంలో ఎరువులు వేయలేకపోయాం. చివరికి ఎంతో కొంత పత్తి చేతికి వస్తుందనుకుంటున్న సమయంలో తుపాను వచ్చి తుడిచిపెట్టుకుపోయింది. ప్రభుత్వం నుంచి పరిహారం మాటే రావడం లేదు. అప్పులు ఎలా తీర్చాలో అర్థంకావడం లేదు.
– గాలం రవి, పత్తి రైతు, గానుగపాడు, చండ్రుగొండ మండలం