టేకులపల్లి, ఆగస్టు 30 : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ‘రైతు రుణమాఫీ’లో ఎన్నో చిత్రవిచిత్ర గాథలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో విచిత్రం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్‌లో అసలు అప్పునే లేదంటూ ఓ రైతుకు రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం తప్పించుకుంది.
పూర్తి వివరాల్లోకెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామానికి చెందిన సూరేపల్లి వెంకట్రావు జిల్లాకేంద్రం కొత్తగూడెంలోని కరూర్ వైశ్యా బ్యాంక్‌లో ఖాతా నెంబర్ 4810272000000047 పేరుతో 2021 ఫిబ్రవరిలో వ్యవసాయ రుణం తీసుకున్నాడు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రుణమాఫీకి తాను అర్హుడైనప్పటికీ మాఫీ కాలేదు. దీంతో వ్యవసాయ అధికారులను సంప్రదించగా.. వారు ‘రైతు సమాచార పత్రం’ చేతిలో పెట్టారు.
అది చూసిన రైతు నివ్వెరపోయాడు. 9-12-2023 తేదీ నాటికి తనకు బ్యాంకులో ఉన్న బకాయి జీరో లేదా నెగిటివ్‌లో ఉన్నట్లు దానిలో ఉంది. ఇదేమిటని అధికారులను అడిగితే.. బ్యాంక్‌లో సంప్రదించాలని ఉచిత సలహా ఇచ్చారు. చేసేదిలేక ఆ రైతు కరూర్ వైశ్యా బ్యాంక్‌కు వెళ్లి స్టేట్మెంట్ తీయించగా.. దానిలో 27-8-2024 తేదీ నాటికి రూ.1,63,258 అప్పు ఉన్నట్లు ఉంది. ఇదెక్కడి విచిత్రమో అర్థంకాక ఆ రైతు తల పట్టుకున్నాడు. తన సమస్యను ఎవరు పరిష్కరిస్తారో తెలియక మదనపడుతున్నాడు.
నా పేరు మీద కొత్తగూడెం కరూర్ వైశ్యా బ్యాంక్‌లో రూ.లక్షన్నర పైగా అప్పు ఉంది. కానీ.. నాకు మాఫీ కాలేదు. వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే 9-12-2023 నాటికి బ్యాంక్‌లో బకాయి ఉన్న రుణం సున్నా లేక నెగటివ్‌లో ఉన్నదని చెప్పారు. ఇదేమిటని అడిగితే.. సరైన సమాధానం చెప్పడం లేదు. పెద్దసార్లు నా యందు దయ ఉంచి రుణమాఫీ చేయాలని కోరుతున్నా.
– సూరేపల్లి వెంకట్రావు, రైతు, కోయగూడెం, టేకులపల్లి