కూసుమంచి(తిరుమలాయపాలెం), అక్టోబర్ 29 : పత్తి, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, తేమ పేరుతో పత్తి, తరుగు పేరుతో ధాన్యం కొనుగోళ్లలో మోసాలు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు క్రిమినల్ కేసులు పెడతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. తిరుమలాయపాలెం మండలం గోల్‌తండాలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో పత్తి రైతులకు నష్టం వాటిల్లిందని, అలాంటి వారికి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు.
జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంట పండించారని, 18 నుంచి 20 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందనే అంచనాతో సీసీఐ ఆధ్వర్యంలో తొమ్మిది కేంద్రాల్లో కొనుగోళ్లు చేపడుతున్నట్లు తెలిపారు. సీసీఐ నిబంధనల ప్రకారం పత్తి కొనుగోళ్లు ఉంటాయన్నారు. వరిలో సన్న రకానికి ప్రభుత్వం రూ.500 చొప్పున బోనస్ ప్రకటించిందని, రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డిసెంబర్ లోపే రూ.13 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. నిరుపేదలకు దీపావళి కానుకగా ఇందరిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు.
అంతకుముందు బీరోలు చెరువు ఆధునీకరణ పనులను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ హరినాథబాబు, ఇరిగేషన్ ఎస్ఈ మంగలపుడి వెంకటేశ్వర్లు, డీఏవో పుల్లయ్య, నాయకులు బెల్లం శ్రీను, బోడా మంగీలాల్, రామసహాయం నరేశ్‌రెడ్డి, చావా శివరామకృష్ణ, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో సిలార్ సాహెబ్ పాల్గొన్నారు.