వైరాటౌన్, మార్చి 12 : ప్రజలపై పన్నుల భారం తగ్గించాలని, పట్టణంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలు వైరాలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు భూక్యా వీరభద్రం, సుంకర సుధాకర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో భారీగా పెంచిన ఇంటి పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ కాలనీ వద్ద వాగుపై కరకట్ట, డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద, గంధం టవర్స్ వద్ద శాశ్వత సైడ్ డ్రైనేజీ, డంపింగ్ యార్డు నిర్మించాలని, కుక్కల బెడద నివారించాలన్నారు.
కేరళ తరహాలో పట్టణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పథకం అమలు చేయాలని, ప్రధాన మార్గాల్లో సైడు కాల్వలు, అంతర్గత రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కమిషనర్ వేణుకు అందజేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ తన పరిధిలోని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బొంతు రాంబాబు, తాళ్లపల్లి కృష్ణ, కొండబోయిన నాగేశ్వరరావు, దిగ్గి కృష్ణ, మచ్చా మణి, తోట నాగేశ్వరరావు, చెరుకుమల్లి కుటుంబరావు, దొంతెబోయిన నాగేశ్వరరావు, బాణాల శ్రీనివాసరావు, తూము సుధాకర్, బొంతు సమత, గుడిమెట్ల రజిత, సుధాకర్ పాల్గొన్నారు.