మధిర, నవంబర్ 15: నిర్మాణం పూర్తయిన వంద పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో మధిరలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలపడంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా నాయకుడు శీలం నరసింహారావు మాట్లాడుతూ పేదలకు వైద్య సేవలు అందించడం కోసం గత కేసీఆర్ ప్రభుత్వం మధిరలో చేపట్టిన వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయిందన్నారు.
దీనిని ప్రారంభించాల్సిన నియోజకవర్గ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు తీరిక లేకపోవడంతో నిరుపయోగంగా మారిందని ఆరోపించారు. వెంటనే ఆసుపత్రిని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు పడకంటి మురళి, మందా సైదులు, ఓట్ల శంకర్రావు, వడ్రానపు మధు, పాపినేని రామనర్సయ్య, తేలప్రోలు రాధాకృష్ణ, గౌర్రాజు ధనలక్ష్మి, షేక్ ఉద్దండు సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.