కారేపల్లి, డిసెంబర్ 02 : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్ధులనే గెలిపించాలని ఆ పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రజలను కోరారు. మంగళవారం కారేపల్లిలో మండల కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం కేసగాని ఉపేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో భూక్యా వీరభద్రం మాట్లాడుతూ.. స్ధానికంగా ఏ సమస్య వచ్చినా సీపీఐ(ఎం) నాయకత్వం ముందుండి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తుందన్నారు. పోడు భూములు, స్ధానిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. సీపీఐ(ఎం) తోనే పేదలకు ప్రభుత్వ పథకాలు, పారదర్శక సాధ్యమని గతంలో నిరూపితమైన పలు సందర్భాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. పైరవీకారులకు పెత్తనం ఇస్తే గ్రామాల్లో కయ్యాలు పెట్టడం, జేబులు నింపుకోవడం చేస్తారని ప్రజలు దానిని గుర్తేరిగి అందరికి అందుబాటులో ఉండే సీపీఐ(ఎం) అభ్యర్ధులను గెలిపించాలని కోరారు.
సింగరేణి మండలంలో సీపీఐ(ఎం) పోటీ చేస్తున్న గ్రామ పంచాయతీలకు అభ్యర్ధులను ప్రకటించారు. బాజుమల్లాయిగూడెంకు బచ్చల స్వర్ణలత, పాటిమీదిగుంపు సూరబాక ధనమ్మ, చీమలపాడు అజ్మీర జ్యోతి, బోటితండా బానోత్ కిషన్, ఎర్రబోడు వజ్జా లక్ష్మి, గాదెపాడు భూక్యా లక్ష్మణ్, కోమట్లగూడెం ఈసం లక్ష్మి, విశ్వనాధపల్లి బానోత్ రవి, సింగరేణి ఇల్లంగి పిచ్చయ్య, ఉసిరికాయలపల్లి బానోత్ సరోజిని, మాధారం భూక్య రజని లను సర్పంచ్ అభ్యర్ధులుగా నిలుపుతున్నట్లు సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కె.నరేంద్ర తెలిపారు. బలం ఉన్న గ్రామ పంచాయతీల్లో అభ్యర్ధులను నిలపడం, భావసారూప్యత గల పార్టీలకు మద్దతు ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మెరుగు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యుడు మెరుగు రమణ, నాయకులు వజ్జా రామారావు, కొండబోయిన ఉమావతి పాల్గొన్నారు.