ఖమ్మం రూరల్, డిసెంబర్ 16 : బీఆర్ఎస్ పార్టీలో చేరికల పరంపర గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం సైతం కొనసాగుతూనే ఉంది. పంచాయతీ ఎన్నికల ముందు ఆయా గ్రామాల్లో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామాలు చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం రాత్రి ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకుడు కొలిచలం గోపయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా నేత మల్లిక వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ అల్లిక వెంకటరమణి సమక్షంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అమ్మరాజు.. గోపయ్యకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పార్టీని గ్రామంలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కేవలం 13 ఓట్లతో పంచాయతీ ఎన్నికల్లో పరాజయం పాలుకావడం జరిగిందని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారి మన్ననలు పొందాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో గూడూరుపాడులో గులాబీ జెండా ఎగరడం వందకు వంద శాతం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పడిగల వెంకటేశ్వర్లు, కొర్రి వెంకన్న, లింగయ్య, కృష్ణ పాల్గొన్నారు.