ఖమ్మం రూరల్ : రోడ్డు భద్రత, సురక్షితమైన ప్రయాణం అనేది ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకున్నప్పుడే రోడ్డు ప్రమాదాలు నియంత్రణలో ఉంటాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా జరుగుతున్న ప్రాణనష్టాన్ని తగ్గించి, ప్రతి ప్రయాణికుడు సురక్షితంగా గమ్యానికి చేరాలనే ఉద్దేశంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజలను సమాయత్తం చేసేందుకు ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ విభాగాలు చెందిన అధికారులు ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఖమ్మం రూరల్ మండలం, వరంగల్ క్రాస్ రోడ్డులో అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే, ఎక్కువ శాతం ప్రమాదాలు మానవ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, హెల్మెట్, సీటుబెల్ట్ వాడకంలో అలసత్వం వంటి కారణాలే ప్రమాదాలకు ప్రధాన కారణాలన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు అవగాహన అత్యంత అవసరమని భావించి ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు. రక్షణాత్మక డ్రైవింగ్ దృష్టి పెట్టాలని, అప్రమత్తంగా, సురక్షితంగా ఉండటం చాల కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రూరల్ ఇన్స్పెక్టర్ రాజు, విద్యుత్ శాఖ (ఏఈ) కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.