పత్తిసాగు ప్రశ్నార్థకమే?
భద్రాద్రి జిల్లాలో ఈ ఏడాది పత్తిసాగు ప్రశ్నార్థకంగా మారింది. నిరుడు అధిక వర్షాలు పడి పత్తి పంటలను నష్టపోయిన రైతులు.. ఈ ఏడాది వానల్లేక ఆందోళన చెందుతున్నారు. ఈ సమయానికి జిల్లావ్యాప్తంగా వందశాతం పత్తి పంట వేయాల్సిన రైతులు ఇప్పటివరకు 80 శాతం వరకే పంట వేశారు. గింజలు మొలకదశలో ఉండడంతో పూర్తిగా బయటకు వస్తాయో రావోనని భయపడుతున్నారు.
- అప్పుడు అతివృష్టి.. ఇప్పుడు అనావృష్టి..
- నిరుడు మక్కలు కొనుగోలు చేయని ప్రభుత్వం
- ఈ ఏడాది పత్తిసాగుపై దృష్టిపెట్టిన రైతులు
- ‘భద్రాద్రి’లో ఇప్పటికి 1.87 లక్షల ఎకరాల్లో పత్తి
- వానల కోసం ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతలు
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 12 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి జిల్లాలో ఈ ఏడాది పత్తిసాగు ప్రశ్నార్థకంగా మారింది. నిరుడు అధిక వర్షాలు పడి పత్తి పంటలను నష్టపోయిన రైతులు.. ఈ ఏడాది వానల్లేక ఆందోళన చెందుతున్నారు. ఈ సమయానికి జిల్లావ్యాప్తంగా వందశాతం పత్తి పంట వేయాల్సిన రైతులు ఇప్పటివరకు 80 శాతం వరకే పంట వేశారు. గింజలు మొలకదశలో ఉండడంతో పూర్తిగా బయటకు వస్తాయో రావోనని భయపడుతున్నారు.
జిల్లాలో ఎల్‌నినో ప్రభావం తక్కువేనని అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వర్షాలు ఏమాత్రం కురవకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా పత్తి సాగు 2.25 లక్షల ఎకరాలు సాగుచేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 1.87 లక్షల ఎకరాల్లో మాత్రమే పత్తిపంటను వేశారు. పత్తిసాగుపై రైతులకు ఆసక్తి ఉన్నప్పటికీ వర్షాభావ పరిస్థితి, ఎరువులు దొరకని దుస్థితిలో ఇబ్బందులు తప్పవేమోనని రైతులు భయపడుతున్నారు.
దేశానికి వెన్నెముకలాంటి రైతులను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం వెనకాడటం లేదు. ఎన్నో కష్టనష్టాలకోర్చి రైతులు పంటలను పండించినా ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది 2.20 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేయగా దిగుబడిలేక రైతులు పత్తిని మూడోసారి తీయలేకపోయారు. తీసిన పత్తి తడిసిపోవడంతో సీసీఐ కేంద్రాల్లో కొనుగోలు చేయకపోవడంతో దళారులను ఆశ్రయించారు. దీంతో దళారులు తేమశాతం పేరుతో రైతులను నిలువునా ముంచారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం జిల్లాపై పడటంతో వర్షాలు అనుకున్నంత కురవడం లేదు. ఇప్పటివరకు ఈ నెలలో 96.5 వర్షపాతం కురవాల్సి ఉండగా ఇప్పటికి 75.5శాతం మాత్రమే వానలు కురిసాయి. గతేడాది 312 సాధారణ వర్షపాతం ఉండగా అత్యధికంగా 378శాతం వర్షం కురియడంతో పత్తి పంటకు తీవ్రంగా నష్టం జరిగింది.
వానల కోసం ఎదురుచూపులు..
ప్రతి ఏటా జూన్ నెలలో పత్తి రైతులు విత్తనాలు చల్లడం పరిపాటి. సీజన్ చూసుకుని పత్తి విత్తనాలు చల్లుతారు. కానీ నెలరోజులు గడుస్తున్నా పత్తి మొక్కలు మూడు అంగులాలకు మించి బయటకు రాలేదు. కొన్నిచోట్ల చిరుజల్లులు పడటంతో అక్కడక్కడ మొక్కలు బయటకు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో భూమి ఎండిపోయి కనిపిస్తున్నది. దీంతో రైతులు వానల కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇల్లెందు, టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో ఎక్కువగా పత్తి సాగు చేసేవారు. గతేడాది మక్కసాగు చేయడం వల్ల మక్కలు కొనుగోలు చేయకపోవడంతో రైతులు నష్టపోయారు.. దీంతో ఈ ఏడాది పత్తివైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది ఆ నాలుగు మండలాల్లో అదనంగా 50వేల ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నారు.
జాడలేని వాన.. కరివేద పు అన్నదాత..
దుమ్ముగూడెం, జూలై 12: జూలై నెలలో పక్షం రోజులు గడుస్తున్నా జిల్లాలో వానలు జాడలేకుండా పోయాయి. దీంతో అన్నదాతలు ఆకాశం వైపు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ చినుకులు పడకపోగా.. ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో కొందరు రైతులు ప్రత్యామ్నాయం వైపు వెళ్తున్నారు. భద్రాచలం ఏజెన్సీలోని దుమ్ముగూడెం మండలం వరి పంటకు ప్రసిద్ధి ఈ మండలంలో 22 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాల్లేకపోవడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మండలంలోని పెద్దనల్లబెల్లికి చెందిన రైతు తెల్లం భీమరాజు ఆదివారం ఐదెకరాల పొలంలో కరివేద పద్ధతిలో విత్తనాలు చల్లాడు. తలాపున తాలిపేరు కాలువ, పక్కనే జీవనది గోదావరి ఉన్నప్పటికీ ఇక్కడి పొలాలకు సాగునీరు అందవు. మోటార్లను నమ్ముకున్న కొందరు రైతులు ఇప్పటికే వరినారు పోశారు. అయితే, విద్యుత్ కూడా సక్రమంగా సరఫరా కాకపోవడంతో నారుమళ్లు మాత్రమే తడుస్తున్నాయంటూ మరికొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంటలు వేయాలంటే భయమేస్తోంది..
పంటలు సాగు చేయాలంటే భయమేస్తోంది. వర్షాధార పరిస్థితుల వల్ల కౌలుకు తీసుకొని పంటలు వేయడమంటే కత్తిమీద సాములా ఉంది. లోటు వర్షం ఉన్న ఈ కాలంలో ఏయే పంటలు వేయాలో కూడా అర్థం కావడం లేదు.
-యనగంటి వెంకటేశ్వర్లు, కౌలు రైతు, దుమ్ముగూడెం
పత్తి రెండున్నరెకరాలు వేశాను..
గతేడాది నష్టపోయినా మళ్లీ పత్తి వేశాను. పోయినసారి బయట అమ్ముకున్నాను నష్టం వచ్చింది. ఈసారి వానలు కురవడం లేదు. చిన్నమొక్కలు వచ్చాయి. ఇప్పటికి 20రోజులైంది. చుక్క వాన కూడా పడలేదు. భయమేస్తున్నది. పత్తి పంట నాశనమైతే ప్రభుత్వమే ఆదుకోవాలి. చాలా రేటు పెట్టి విత్తనాలు కొన్నాను. పెట్టుబడి కూడా చాలా పెట్టాను.
– మూడ్ సుధాకర్, గోల్యతండా, టేకులపల్లి
నాలుగెకరాల్లో పత్తి వేశాను
ప్రతిరోజూ ఆకాశంవైపు చూస్తున్నాం.. వాన మాత్రం కురవడం లేదు. మబ్బులు వేస్తే హమ్మయ్య అనుకుంటున్నాం.. కానీ మబ్బులు పైనుంచి పైకే వెళ్లిపోతున్నాయి. చిన్నచిన్న చినుకులు పడిపోతున్నాయి. ఏంటో వాతావరణం అర్థంకావడం లేదు. బయట నుంచి నీరు తెచ్చి పొయ్యాలంటే మా వల్లకాదు. పంటను వదులుకోవాల్సిందే.
– బోడ బొజ్జ, సింగ్యాతండా, టేకులపల్లి
ఈ నెలలో వానలున్నాయి..
వాతావరణశాఖ సమాచారం ప్రకారం ఈ నెల వానలున్నాయి. తప్పనిసరిగా కురుస్తాయి. ఎల్‌నినో ప్రభావం కొంతవరకు ఉంటుంది కానీ.. ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ తక్కువగానే ఉంది. ఎరువుల కొరత లేదు. ప్రతి రైతుకు కావాల్సిన ఎరువులు దొరుకుతాయి. గతేడాది కన్నా ఈసారి పత్తి బాగా వేస్తున్నారు. ఆళ్లపల్లి, గుండాల, ఇల్లెందు, టేకులపల్లి మండలాల నుంచి రైతులు మక్కలకు బదులు పత్తి వేస్తున్నారు. ఈ నెల చివర్లో కూడా పత్తి వేయడానికి అనువుగా ఉంది.
– వేల్పుల బాబూరావు, డీఏవో, కొత్తగూడెం
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

