కొత్తగూడెం సింగరేణి, నవంబర్ 15: సింగరేణి సంస్థ గడిచిన ఏడు నెలల కాలంలో గత ఏడాదితో పోలిస్తే రూ.వెయ్యి కోట్ల కన్నా ఎక్కువ లాభాలు గడించి ముందుకు దూసుకెళ్తున్నది. తొలుత బొగ్గు ఉత్పత్తికి కొన్ని అవాంతరాలు ఏర్పడినప్పటికీ వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత తన వినియోగదారులకు తగినంతగా బొగ్గు ఉత్పత్తిని సరఫరా చేస్తున్నది. సంస్థ సీఎండీ బలరాం ప్రతిరోజూ అన్ని ఏరియాల జీఎంలతో ఉత్పత్తిపై ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తూ.. అవాంతరాలను అధిమించేందుకు దిశా నిర్దేశం చేస్తూ లక్ష్య సాధన దిశగా సమాయత్తం చేస్తున్నారు.
ఫలితంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ తొలగింపులో గణనీయమైన వృద్ధి కనిపిస్తున్నది. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ వార్షిక ఉత్పత్తి లక్ష్యం 720 లక్షల టన్నులను సాధించాలని సింగరేణి వ్యాప్తంగా అధికార యంత్రాంగం సమాయత్తమై పనిచేస్తున్నది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు బొగ్గు విక్రయం ద్వారా రూ.17,151 కోట్లు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.2,286 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు బొగ్గు, థర్మల్ విద్యుత్ అమ్మకాల ద్వారా పన్ను చెల్లింపునకు ముందు రూ.4 వేల కోట్ల స్థూల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. గతేడాది ఇదే సమయానికి ఆర్జించిన రూ.2,932 కోట్ల మీద ఇది రూ.1,072 కోట్లు అదనం కావడం విశేషం. మొత్తంమీద గత ఏడాదితో పోలిస్తే సింగరేణి సంస్థలో స్థూల లాభంపై 36 శాతం వృద్ధి నమోదైంది.