Paleru | కూసుమంచి, అక్టోబర్ 16: పాలేరు నియోజకవర్గంలో యువత ఓట్లే కీలం కానున్నాయి. జిల్లాలోనే అత్యధిక మంది యువతీ యువకులు ఓటర్లుగా ఉన్న నియోజకవర్గంగా పాలేరు నిలిచింది. తాజా ఓటర్ల జాబితా ప్రకారం.. పాలేరు నియోజకవర్గంలోని ఓటర్లలో యువ ఓటర్లే 24.50 శాతం మంది ఉన్నారు. ఈ నెల చివరి వరకూ ఓటు నమోదు కోసం గడువు ఉండడంతో వీరు ఇంకో శాతం మంది పెరిగే అవకాశం ఉంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో పాలేరులో 1.97 వేల ఓట్లు ఉండగా ఈసారి 2,32,606 మంది ఓటర్లు ఉన్నారు.
సుమారు 35 వేల మంది కొత్తగా ఈ ఐదేళ్లలో సంవత్సరాల్లో ఓటు హక్కును పొందారు. ఈ సారి అధికంగా యువ ఓటర్లు ఉండడంతో వారి పాత్ర కీలకంగా మారనుంది. 19 – 29 మధ్య వయసు గల యువతీ యువకులు పోలింగ్లో అధికంగా పాల్గొనే అవకాశం ఉంది. జిల్లాలోనే అత్యధిక యువ ఓటర్లు గల నియోజకవర్గంగా పాలేరు ఉంది. నియోజవర్గంలోని నాలుగు మండలాల్లోని ఓటర్ల జాబితాలోనూ యువ ఓటర్లు కీలకంగా మారనున్నారు. మొత్తం ఓటర్లలో 56,992 మంది యువ ఓటర్లు ఉన్నారు. అంటే మొత్తం నియోజకవర్గంలోని ఓటర్లలో 24.50 శాతం మంది వీరే.
ఉమ్మడి జిల్లాలోని 10 నియోజవక వర్గాల్లో పాలేరులోనే యువ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఖమ్మం లాంటి అత్యధిక మంది ఓటర్లున్న నియోజవర్గంలోనూ యువ ఓటర్లు శాతం పాలేరు కంటే తక్కువగానే ఉంది. పాలేరులోని నాలుగు మండలాలైన కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, నేలకొండపల్లిల్లో గతంలో 263 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఈ సారి అవి 289కి పెరిగాయి. యువ ఓటర్ల సంఖ్య పెరగడంతో అధికారులు కొత్తగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కాగా, అధికారులు అన్ని గ్రామ పంచాతీయల్లోనూ సీ విజిల్ యాప్ గురించి విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు పోలింగ్ కేంద్రాలు, గ్రామ కూడళ్లు, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.