ఖమ్మం, జూలై 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘రేవంత్‌రెడ్డీ.. ఖబడ్దార్..’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్ హెచ్చరించారు. ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వద్దంటావా..? అన్నదాతలంటే అంత చులకనా..’ అంటూ దుయ్యబట్టారు. ‘ఎకరం పొలం పారించేందుకు ఒక్క గంట కరెంట్ చాలు. మూడు ఎకరాలకు మూడు గంటలు సరిపోతుంది.’ అంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటీవల ఆమెరికా సభలో చేసిన వ్యాఖ్యలపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు బుధవారం రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇందులో మంత్రి అజయ్ పాల్గొని మాట్లాడారు. రైతులను అవమానించేలా చేసిన వ్యాఖ్యలను రేవంత్‌రెడ్డి బేషరతుగా వెనక్కి తీసుకోవాలని, రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులపై ఉన్న అక్కసును రేవంత్ మరోసారి వెళ్లగక్కారని అన్నారు. వ్యవసాయానికి సీఎం కేసీఆర్ 24 గంటలూ ఉచిత విద్యుత్ ఇస్తుండడాన్ని కాంగ్రెసోళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.
రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు పాతరేయడం ఖాయమని మంత్రి తేల్చిచెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముందుగా చేసేది రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను రద్దు చేయడమేనని అన్నారు. ఓట్లడిగేందుకు కాంగ్రెసోళ్లు ఊళ్లల్లోకి వస్తే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు బచ్చు విజయ్‌కుమార్, భుక్యా గౌరి, గుత్తా రవి, అజ్మీరా వీరూనాయక్, మందడపు నర్సింహారావు, మందడపు సుధాకర్, మందడపు మాధవరావు, లక్ష్మణ్‌నాయక్, పగడాల నాగరాజు, మద్దినేని వెంకటరమణ, పిన్ని కోటేశ్వరరావు, కుర్రా భాస్కర్‌రావు, మందా సంజీవరావు, మందడపు శంకర్రావు, మెంటెం రామారావు, మాదంశెట్టి హరిప్రసాద్, గుడిపుడి రామారావు, చెరుకూరి ప్రదీప్, తేజావత్ రమేశ్, బోడా సైదులు, వాంకుడోతు సురేశ్, తొలుపునూరి దానయ్య, కుతుంబాక నరేశ్ తదితరులు పాల్గొన్నారు.