ఖమ్మం, మార్చి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముగ్గురు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిధుల వరద ప్రవహించి అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని భావించిన జిల్లా ప్రజలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మరోసారి నిరాశ నిస్పృహలకు గురిచేసింది. ప్రధాన ప్రాజెక్టుల పూర్తికి ఈ బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంతో జిల్లా ప్రజల ఆశలు మరోసారి ఆవిరయ్యే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి హోదాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలా ఉందని ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. జిల్లా ప్రజల అవసరాలను, అభివృద్ధిని కాంక్షించే రీతిలో లేదని విమర్శించారు.
ఉమ్మడి జిల్లా రైతాంగానికి వరప్రదాయినిగా భావించే సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసేందుకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించలేదు. దీంతో ఈ ఏడాది కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగే పరిస్థితి నెలకొందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఖమ్మం మున్నేరుపై రూ.690 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు గత బడ్జెట్లో నిధులు కేటాయించినప్పటికీ ఇప్పటివరకు కేవలం రూ.200 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో మిగిలిన నిధులు ఈ బడ్జెట్లో కేటాయించారా? లేదా? అనే అంశంపై స్పష్టత లేదు. వచ్చే వర్షాకాలం నాటికి ఈ వాల్ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని మంత్రులు హామీ ఇస్తున్నా బడ్జెట్లో నిధుల ప్రస్తావన లేకపోవడంతో వాల్ నిర్మాణంపై సందేహాలు నెలకొన్నాయి.
ఇక ఖమ్మం నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని మరో వంతెన నిర్మించడానికి గత బడ్జెట్లో రూ.26 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈ బడ్జెట్లో దాని ఊసే లేకపోవడంతో కొత్త బ్రిడ్జి నిర్మాణం ఇప్పట్లో లేదనే భావన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య తదితరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముగ్గురు మంత్రుల ప్రాతినిథ్యమైన ఖమ్మం జిల్లాలో అభివృద్ధికి అవసరమైన నిధులు బడ్జెట్లో కేటాయించుకోలేకపోయారని విమర్శించారు. ప్రధాన వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యం లభించలేదని, ఈ బడ్జెట్ అనేక వర్గాలను నిరాశపరిచిందని అభిప్రాయపడ్డారు.
అయితే, విద్యారంగాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, బడ్జెట్లో మొండిచెయ్యి చూపిందని ఆరోపిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మం ప్రభుత్వ మహిళా కళాశాల ఎదుట బడ్జెట్ ప్రతులను విద్యార్థులు దహనం చేశారు. సంక్షేమం, అభివృద్ధిని కాంక్షించే రీతిలో ఈ బడ్జెట్లో కేటాయింపులు సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పెదవి విరిచారు. ఈ బడ్జెట్ పేదల ఆకాంక్షలను ప్రతిబింబించలేకపోయిందని సీపీఐ జాతీయ సమితి నాయకుడు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేశ్ విమర్శించారు. వ్యవసాయ సాగునీటి రంగానికి అవసరమైన కేటాయింపులు బడ్జెట్లో జరగలేదని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలను తీవ్ర నిరాశపరిచింది. డిఫ్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రూ.3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు కేవలం 5 శాతం నిధులు కూడా కేటాయించకపోవడం దారుణం. సమగ్ర సర్వే చేసినప్పుడు బీసీల జనాభాను 40 లక్షలు పైచిలుకు తగ్గించి చూపించి మోసం చేశారు. కామారెడ్డిలో ఆర్భాటంగా ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా మోసం చేశారు.
బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామన్న హామీని నిలబెట్టుకోకుండా మోసం చేశారు. మంత్రి మండలిలో యాదవ, మున్నూరుకాపు, రజక, లంబాడీలకు స్థానం కల్పించకుండా, కార్పొరేషన్ల చైర్మన్ల పదవుల్లో బీసీలను నియమించకుండా నయవంచన చేశారు. యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని కూడా విస్మరించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులు ఆందోళన చెందుతున్నారు. వృత్తి విద్యా కోర్సులు, ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ప్రస్తావన లేదు. జర్నలిస్టుల సంక్షేమం గురించి బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావనే లేకపోవడం బాధాకరం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించి వెంటనే అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. – వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు
కేసీఆర్ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా రైతులకు సీతారామ ప్రాజెక్టు ద్వారా నీరందించడానికి ప్రధాన కాలువ నిర్మాణం పూర్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తయింది, పోయిన బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశ పడ్డా నిరాశే మిగిలింది. ప్రస్తుత బడ్జెట్లో అయినా సీతారామ ప్రాజెక్టు నీళ్లు జిల్లాకు అంతర్గత కాలువల నిర్మాణానికి నిధులు కేటాయించి రైతులకు అండగా ప్రభుత్వం నిలుస్తుందని అనుకున్నాం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సారికూడా మొండిచేయి చూపింది. భద్రాద్రి జిల్లాలో రైతులు పండించే పంటలకు నీరు లేక ఎండుతున్నాయి. ముగ్గురు మంత్రులు ఖమ్మం ప్రాంతానికే నీళ్లు తీసుకెళ్లారు. అలాగే బీసీలకు బడ్జెట్లో తీవ్ర అన్యాయం చేశారు.
-దిండిగాల రాజేందర్, భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్
ఆరు గ్యారెంటీలు, 11 డిక్లరేషన్లు అంటూ అంతా మోసం. భట్టిది అంతా వట్టి బడ్జెట్. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత మోసంతో కూడిన బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు. అంతా మోసం.. అన్నీ అబద్ధపు మాటలే. ఇచ్చిన ఏ ఒక హామీని కూడా నెరవేరుస్తామని బడ్జెట్లో ప్రస్తావించలేదు. వృద్ధులు, మహిళల శాపం ప్రభుత్వానికి కచ్చితంగా తగులుతుంది. నిరుద్యోగ యువతకు సైతం తీరని అన్యాయం జరిగింది. ఇది అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్. ఉద్యోగులు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయింపులు అంతంతమాత్రమే. అన్ని వర్గాల సంక్షేమ పథకాలకు సైతం పూర్తిస్థాయి కేటాయింపులు లేకుండా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది.
-బొమ్మెర రామ్మూర్తి, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ నాయకుడు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో భద్రాచలం నియోజకవర్గానికి మొండిచేయి చూపింది. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న మోడికుంట, తాలిపేరు ప్రాజెక్టుల అభివృద్ధి పనులకు, భద్రాచలం కరకట్ట విస్తరణ పనులకు సంబంధించి ఎటువంటి ఊసే లేదు. ఈ బడ్జెట్ మహిళలకు, రైతులకు ఇచ్చిన వాగ్దానాలను సైతం విస్మరించింది. మహిళలకు నెలకు 2,500, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు, రైతు భరోసా కింద ఏటా రూ.15 వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పింది. భద్రాచలం – వెంకటాపురం రహదారి విస్తరణకు సంబంధించి ఎటువంటి ఊసే లేదు.
-మానె రామకృష్ణ, బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ నాయకుడు
భారీ బడ్జెట్ అంటూ ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించింది. ఎన్నికల ముందు కార్మికులకు వేతనాలు పెంచుతామని మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రభుత్వం మూడుసార్లు బడ్జెట్ పెట్టినప్పటికీ కార్మికుల వేతనాలు పెంచలేదు. కార్మిక సంక్షేమానికి రూ.900 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని సివిల్ సర్వీస్ అభ్యర్థుల కోసం ఖర్చుపెట్టిన ప్రభుత్వం అదే సింగరేణి లాభాలకు కారణమైన కాంట్రాక్ట్ కార్మికుల జీతాల పెంపుపై నోరు విప్పలేదు. ఇప్పటికే కార్మికులకు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం చేస్తున్న పోరాటాలను మరింత ఉధృతం చేస్తాం.
-కె.బ్రహ్మచారి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, భద్రాచలం
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు రూ.12వేల కోట్లు మాత్రమే కేటాయించి తీరని అన్యాయం చేసింది. రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా తెలంగాణ సామాజిక న్యాయం సాధ్యం కాదు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో బీసీలను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఆర్థిక మద్ధతు అవసరం. బీసీ కార్పొరేషన్ రుణాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలి. సబ్సిడీ రుణాలు, స్టార్టప్ ప్రోత్సాహకాలు, బీసీ స్వయం ఉపాధి అవకాశాలు అమలు చేయాల్సి ఉంది. కేవలం బడ్జెట్ ప్రకటనలే కాకుండా స్పష్టమైన కేటాయింపులు జరగాల్సి ఉండగా.. అవేమీ పాటించలేదు. ప్రతీ పంచాయతీలో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికీ సరైన కేటాయింపులు లేకపోవడంతో అభివృద్ధికి దూరమయ్యే అవకాశం ఉంది.
-మహంకాళి రామారావు, బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు
కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాలను నిరాశ పర్చింది. ఏ రంగానికీ పరిపూర్ణంగా నిధులు కేటాయించలేదు. వ్యవసాయంలో దీర్ఘకాల ప్రణాళిక లోపం ఉంది. రైతులకు తక్షణ సబ్సిడీలు ఉన్నా నీటి వనరులు, నిల్వలు, మార్కెట్ ధరల స్థిరీకరణపై స్పష్టమైన ప్రణాళికలు లేవు. పరిశ్రమలు, ఉద్యోగాలు, కొత్తగా భారీ ఉద్యోగాల సృష్టిపై స్పష్టత లేదు. యువతకు ప్రైవేట్ రంగంలో అవకాశాలు పెంచే చర్యలు తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల మెరుగుదలకు పెద్దగా నిధులు కేటాయించలేదు. గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత సమస్యను తక్కువగా ప్రస్తావించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది.
-సంకుబాపన అనుదీప్, బీఆర్ఎస్ నాయకుడు, కొత్తగూడెం
శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో సంక్షేమ పథకాలకు కనీస ప్రాధాన్యత ఇవ్వలేదు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు ఇతర హామీలను అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన బడ్జెట్ తీవ్ర నిరాశ కలిగించింది. మహిళలకు బడ్జెట్లో ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. పింఛన్ల పెంపు, మహాలక్ష్మి, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీల వంటి అనేక హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. వేదికలపై మాత్రం ప్రచారం చేసుకుంటోంది.
-బుద్దే పద్మ, గృహిణి, అశ్వారావుపేట
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం జరిగింది. బీసీ సబ్‌ప్లాన్ అంతా పెద్ద మోసం. అంకెల గారడీ తప్ప ఇందులో వాస్తవాలు కనిపించడం లేదు. బీసీలను కాంగ్రెస్ సర్కార్ ఓటు బ్యాంకుగానే చూస్తోంది తప్ప వారి అభివృద్ధి, సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదు. ఇందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలే సాక్ష్యం. బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధుల కేటాయింపుతోపాటు ఇతర హక్కులపై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం.
-యూఎస్ ప్రకాశ్‌రావు, మున్నూరు కాపు సంఘం నియోజకవర్గ కో-ఆర్డినేటర్, అశ్వారావుపేట
రాష్ట్ర బడ్జెట్లో మైనార్టీల అభివృద్ధికి అరకొరగా నిధులు కేటాయించడం దురదృష్టకరం. గత ఏడాది బడ్జెట్లో రూ.3,591 కోట్లు కేటాయిస్తే.. ఈసారి కేవలం రూ.3,769 కోట్లు కేటాయించడం బాధాకరం. మైనార్టీలు రాజీవ్ యువ వికాస పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే అర్హులైన ఒక్క మైనార్టీకి కూడా రుణం ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు మైనార్టీల సంక్షేమ బడ్జెట్ రూ.4 వేల కోట్లకు పెంచుతామని చెప్పి.. ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆ హామీని విస్మరించడం సరికాదు. మైనార్టీలకు విద్య, ఉపాధి, సంక్షేమ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించి బడ్జెట్‌ను పెంచాలి.
-యాకూబ్‌పాషా, మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కొత్తగూడెం
కాంగ్రెస్ అంటేనే మోసం అనే విషయం ఈ బడ్జెట్‌తో మరోసారి రుజువైంది. అసలు మోసాల పునాదుల మీదే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందుకే ప్రజాసంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని విస్మరిస్తోంది. శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించిన బడ్జెట్ రేవంత్‌రెడ్డి సరారు అసమర్థ పాలనకు అద్దం పడుతోంది. అన్ని వర్గాల ప్రజల ఆశలను బడ్జెట్ నిరాశపరిచింది. -ఎం.పాండురంగా, సీపీఎం నాయకుడు,
2026-27 సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వాటి పరిష్కారంపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. జిల్లాకు ముగ్గురు మంత్రులున్నప్పటికీ జిల్లాకు యూనివర్సిటీ స్థాపనపై నోరు విప్పకపోవడం బాధ్యతారాహిత్యం.
-వెంకటేశ్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి వర్గాలకు భరోసానివ్వలేదు. కేవలం అంకెల గారడీతో తెలంగాణ సమాజాన్ని పక్కదోవ పట్టించేలా చేశారు. ప్రధానంగా ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల ప్రస్తావనే లేకుండా వాటికి సమాధి కట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు, గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాం. అవి అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేశాం. కానీ, కాంగ్రెస్ సర్కారు వచ్చి రెండున్నరేండ్లు గడిచినప్పటికీ పట్టణాల అభివృద్ధికి గ్రాంట్స్ లేవు. అవి మంజూరు చేయని కారణంగా పట్టణాల్లో అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. మాయ మాటలు, మోసపూరిత ప్రసంగాలతో ప్రజలను ఇంకెంత కాలం నమ్మిస్తారు?
– పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ మంత్రి
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు హామీల వర్షం కురిపించారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చారు. రెండున్నరేండ్లు గడిచినప్పటికీ వాటి అమలుకు ప్రత్యేక కార్యాచరణ లేకపోవడం బాధాకరం. రైతులకు ఎకరానికి ఏటా రూ.15 వేలు, మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి కింద రూ.లక్షతోపాటు తులం బంగారం, ఆటో డ్రైవర్లకు నెలకు రూ.12 వేలు, వృద్ధులకు, వితంతువులకు రూ.4 వేల పింఛన్లు వంటి అనేక తప్పుడు వాగ్ధానాలు ఇచ్చారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో వాటి అమలుకు నిధులు కేటాయించకపోవడం కాంగ్రెస్ అనైతిక పాలనకు అద్దం పడుతోంది. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. మాట ఇచ్చి తప్పిన ప్రభుత్వాలకు గట్టి బుద్ధి చెబుతారు.
– తాతా మధు, ఎమ్మెల్సీ
బడ్జెట్లో అన్ని రంగాలకు కేటాయింపులు చేయలేక చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. బడ్జెట్ ఇప్పటికి మూడుసార్లు ప్రవేశపెట్టినా.. కేటాయింపులు మాత్రం జరగడం లేదు. మహిళా సంఘాలకు ఇప్పటివరకు వడ్డీలేని రుణాలు ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లాకు ముగ్గురు మంత్రులున్నా భద్రాద్రి జిల్లాకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు జరగడం లేదు. ఆరు గ్యారెంటీలకు బడ్జెట్లో ఇప్పుడు నిధులు కేటాయించారంటే.. అవి అమలు కావడం లేదని ఒప్పుకున్నట్లే కదా. ప్రభుత్వానివన్నీ గారడీ లెక్కలు, మాయమాటలు. వేల కోట్ల బడ్జెట్ ఇచ్చినా ఎవరికీ ఉపయోగం లేకుండా పోతుంది. కౌలు రైతులకు సంబంధించి వరాల ఊసే లేదు.
-కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్, కొత్తగూడెం