చర్ల, డిసెంబర్ 1 : బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మేజర్ పంచాయతీలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలివిడత నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో తమ అభ్యర్థుల గెలుపు కోసం ఆయా రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. చర్ల పంచాయతీలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి సోయం క్రిష్ణవేణి గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.
దీనిలో భాగంగా సోమవారం ఇంటింటి ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చీమలమర్రి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ముమ్మనేని అరవింద్, పోలిన లంకరాజు, పోట్రు బ్రహ్మానందరెడ్డి, బి సత్ష్, అలవాల సతీష్ తదితరులు మద్దతు తెలిపి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి విషయంలో తమ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నదని ఆరోపించారు. అందుకే తాము బీఆర్ఎస్ పార్టీ బలర్చిన అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ అభ్యర్థి పూజారి సామ్రాజ్యం స్థానికేతరులు అని, అందుకే సోయం క్రిష్ణవేణిని గెలిపించేందుకు తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు, మాజీ జడ్పీటీసీ సోయం రాజారావు, సీపీఎం నాయకులు మచ్చా రమారావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
చర్ల బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి సోయం క్రిష్ణవేణికి పలు పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు మద్దతు పలుకుతున్నాయి. అభ్యర్థి ఎంపిక మొదటి నుంచీ సీపీఎం పార్టీ నాయకులు బీఆర్ఎస్తో కలిసి నడుస్తున్నారు. తాజాగా చర్ల మండల గణేశ్ ఆటోవర్కర్స్ యూనియన్ క్రిష్ణవేణికి మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు పామార్ బాలాజీ మాట్లాడుతూ క్రిష్ణవేణి గెలుపు కోసం తామంతా సహకరిస్తామని అన్నారు. యూనియన్ నాయకులు తెల్లం మల్లాజి, అజయ్‌కుమార్, దానసరి సంపత్, బాలరాజు, సత్తిరాజు, కోడిరెక్కల నాగరాజు, చల్లా అశోక్, జంజిరాల తులసీరాం, కుక్కడపు రాంబాబు పాల్గొన్నారు.