ఖమ్మం రూరల్, అక్టోబర్ 24 : బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితలయ్యే ఇతర పార్టీలకు చెందిన వారు గులాబీ గూటికి వస్తున్నారని ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం నేలకొండపల్లి మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య అధ్వర్యంలో కొత్త కొత్తూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. మండంలోని సాయి గణేశ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసుధన్‌తో కలిసి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు దేవశెట్టి రాము, కాంగ్రెస్‌పార్టీ యూత్ మండల అధ్యక్షుడు పగిడిమర్రి అజయ్‌కుమార్, దేవశెట్టి మురళి, సిలివేరు భధ్రయ్య, కాసాని వెంకటేశ్, శత్రియ రఘు, ప్రవీణ్, నాగరాజులకు గులాబీజెండా కప్పి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చే సమయంలో కనపడే నాయకులు, నిరంతరం ప్రజల మధ్యనే ఉండి సేవలు అందించిన నాయకులు ఎవరో పాలేరు ప్రజలు గుర్తించారన్నారు. ఎంత హడావిడి చేసినా చివరకు గులాబీ జోరులో కొట్టుకుపోక తప్పదన్నారు. మాయమాటలకు, గారడి చేష్టలకు పాలేరు ప్రజలు ఎప్పటికీ మోసపోరన్నారు. పాలేరుకు భూమి పుత్రడు ఎవరు, దత్త పుత్రుడు ఎవరో అన్నది ఇప్పటికే ప్రజలకు తెలుసునని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని వారు సూచించారు.