మధిర, జూన్ 25 : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తూ కాలం గడుపుతుందని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. బుధవారం చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో గురుజాల హనుమంతరావు నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి రైతులను, పేదలను, మహిళలను మాయ మాటలతో మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ మోసపూరిత మాటలతో ఇబ్బందులు పెడుతుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచినప్పటికీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పన కోసం రాజీవ్ వికాస్ పథకాన్ని ప్రవేశపెట్టి, ఏ ఒక్కరికి పథకాన్ని మంజూరు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ముడిపెడుతున్నారని విమర్శించారు.
రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఏం చేశారని సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నేటి వరకు కూడా 45 శాతం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి రూ.12 వేలకే కుదించినట్లు చెప్పారు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అందాల్సిన రైతు భరోసాను రెండు సీజన్లకు ఎగ్గొట్టిందని, ఒకసారి కేవలం మూడున్నర ఎకరాల రైతులకు మాత్రమే రైతు భరోసా చెల్లించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుంట భూమి ఉండి రైతు మృతి చెందితే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు బీమా చెల్లించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది చనిపోయినా బీమా చెల్లించడానికి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడం దారుణమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులను తోడ్పాటు అందించామని సంబురాలు చేసుకుంటున్నారా… లేక మోసాలు చేశామని సంబురాలు చేసుకుంటున్నారా అన్న విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ సభ్యుడు మంకెన రమేశ్, మాజీ ఎంపీపీ మునుగోడు రత్నాకర్, గురజాల హనుమంతరావు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బొడ్డు వెంకట రామారావు, వంకాయలపాటి సత్యనారాయణ, గురుజాల కృష్ణయ్య, పువ్వాల వెంకటేశ్వర్లు, ఎండపల్లి జనార్దన్ రావు, తాతా ప్రసాద్, కొల్లి బాబురావు, సామినేని అప్పారావు, బొగ్గరపు రాంబాబు, రాచబంటి రమేశ్ పాల్గొన్నారు.