మధిర, సెప్టెంబర్ 16 : రైతులకు యూరియా, ఎరువులు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దీనిపై దృష్టి సారించకుండా బీఆర్ఎస్ నాయకులు, విలేకరులపై అక్రమ కేసులు పెట్టడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనమని ఆ పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. మధిర మండలంలోని జగన్నాపురం మాజీ సర్పంచ్ ఆలస్యం నాగయ్య, నరసింహాపురం మాజీ ఉప సర్పంచ్ లోయ మల్లికార్జున, నేరడ గ్రామంలో చింతకాని పీఎస్సీ డైరెక్టర్ నన్నక కోటయ్య, కోమట్లగూడెం గ్రామంలో మాజీ సర్పంచ్ వేముల నర్సయ్యను మంగళవారం ఆయన పరామర్శించారు. చింతకాని మండలం, కోమట్లగూడెంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతులు ఎరువుల కోసం ఎప్పుడూ ఇబ్బంది పడలేదన్నారు. కాంగ్రెస్ వస్తే యూరియా కోసం చెప్పులు లైన్లలో పెట్టి నిలబడాల్సి వస్తుందని కేసీఆర్ నాడు చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఈ సమస్యలను పరిష్కరించకుండా బెదిరించి పార్టీలోకి చేర్చుకోవడం, విలేకరులపై అక్రమ కేసులు పెట్టడం లాంటి దిగజారుడు రాజకీయాలకు కాంగ్రెస్ పాల్పడుతోందని విమర్శించారు. తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష అని, రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ గురజాల హనుమంతరావు, జిల్లా రైతు నాయకులు మంకెన రమేష్, మండల కార్యదర్శి బొడ్డు వెంకట రామారావు, మాజీ ఎంపీపీ రత్నాకర్, మండల యూత్ నాయకులు పిన్నెల్లి శీను, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు కన్నబోయిన కుటుంబరావు, మాజీ సర్పంచులు సురేష్, కొండలు, సిలార్, వేముల నరసయ్య, మాజీ ఎంపీటీసీ భగవాన్, సీనియర్ నాయకులు వంకాయలపాటి సత్యనారాయణతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.