గార్ల, ఫిబ్రవరి 20 : ప్రాణాలైపా ఇస్తాం.. కానీ, పాకాల ఏరు లింక్ కెనాల్ నిర్మాణానికి తమ భూములు ఇవ్వమని రైతులు తేల్చి చెప్పారు. గార్ల మండల పరిధిలోని దుబ్బగూడెం వద్ద నిర్మించనున్న కాల్వతో జల దోపిడీ జరిగి తమ ప్రాంతం ఏడారి అవుతుందని, దానికి వ్యతిరేకంగా అఖిల పక్షనాయకులతో కలిసి రైతులు పోరాటాలు ఉధృతం చేయాలని మున్నేరు జల సాధన కమిటీ కన్వీనర్ గంగావత్ లక్ష్మణ్‌నాయక్, శీలంశెట్టి రమేశ్, కందునూరి శ్రీనివాస్‌రావు పిలుపునిచ్చారు.
శుక్రవారం గార్ల మండల కేంద్రంలోని పుట్టకోట బజార్, కొలిమికొట్టం బజార్, దంపకం బజార్, తహసీల్దార్ బజార్, ఎరుకల బజార్లో జరిగిన రైతుల అవగాహన సదస్సుల్లో వారు మాట్లాడారు. దశాబ్దాలుగా ముల్కనూర్ వద్ద మున్నేరుపై ప్రాజెక్టు నిర్మించి 24వేల ఎకరాలకు సాగునీరు అందించాలని అనేక పోరాటాలు చేశామన్నారు. కానీ, ఎలాంటి పోరాటం లేకుండా ఖమ్మం జిల్లా మంత్రులు మున్నేరు ప్రాజెక్టు నీళ్లను సీతారామ ప్రాజెక్టు ద్వారా పాలేరుకు పంపించడానికి రూ.162 కోట్లు కేటాయించి, ఇక్కడి రైతులను దగా చేస్తున్నారని ఆరోపించారు.
రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రైతుల భూముల్లో జెండాలు పాతడం వారిని అవమానించడమేనన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ భూములు పాకాల ఏరు కెనాల్ నిర్మాణానికి ఇవ్వబోమని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ముల్కనూర్ వద్ద మున్నేరు ప్రాజెక్ట్ నిర్మించే వరకు పోరాటాలు నిర్వహించాలని, రేపటి నుంచి రాస్తారోకోలు, ధర్నాలు, రైలురోకోలు చేయాలని నిర్ణయించారు.
కందునూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో అఖిల పక్షం నాయకులు, రైతులు, మున్నేరు జల సాధన కమిటీ సభ్యులు జడ సత్యనారాయణ, ఈశ్వర లింగం, కత్తి సత్యం, సక్రూనాయక్, జంపాల విశ్వ, ఇర్రి రవి, పూనెం శ్రీనివాస్, శ్రీనాథ్, పానుగంటి రాధాకృష్ణ, షర్పొద్దీన్, విమల్ జైన్, దేవా, సత్యవతి, రామకృష్ణ, అజ్మీరా వెంకన్న, కత్తి సత్యం, ఉదయ్‌కుమార్ బానోత్ చందర్ పాల్గొన్నారు.