కారేపల్లి, మార్చి 28 : రైతు రుణ మాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాటమార్చి మోసం చేస్తుందని తెలంగాణ రైతు సంఘం సింగరేణి మండల అధ్యక్ష, కార్యదర్శులు ముండ్ల ఏకాంబరం, వజ్జా రామారావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అధికారంకోసం ఆరు గ్యారంటీలు, 420 వాగ్ధానాలు చేసిన కాంగ్రెస్ వాటి అమలుకు జీఓ తెస్తున్నట్లు నాటకాలు ఆడిందన్నారు. ఆచరణలో పావువంతు కూడా చేయకుండా అన్ని చేసినట్లు ప్రకటనలు ఇచ్చుకోవడం అవివేకమన్నారు. రైతు భరోసా ఒక విడుత ఎగవేసిన ప్రభుత్వం, రైతు రుణమాఫీని 30 శాతం మందికి మాత్రమే చేసి పూర్తిగా చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడం విచారకరమన్నారు.
రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతులకు మంత్రి ప్రకటన ఆశనిపాతంగా మారిందన్నారు. వరి ధాన్యంకు బోనస్ చాలా మంది రైతులకు ఇవ్వలేదన్నారు. పంటల దిగుబడి తగ్గి, పంట ధరలు రోజురోజుకు పడిపోతున్నా రైతుల బాధలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. రైతును మోసం చేస్తే ప్రభుత్వానికి పుట్టగతులుండవని హెచ్చరించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ లపై రైతులను సమీకరించి పోరాటాలతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కరపటి సీతారాములు, బోజెడ్ల గోవిందరావు, పాసిన్నినాగేశ్వరరావు, వల్లభినేని మురళి పాల్గొన్నారు.