ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, మే 1 : రేషన్ కార్డుల పేరిట ఉమ్మడి జిల్లా ప్రజలను రేవంత్ ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోంది. పాత కార్డుల్లోని పేర్లు ఆగమేఘాలమీద తొలగిస్తున్న కాంగ్రెస్ సర్కారు.. కొత్త కార్డులు మాత్రం సకాలంలో ఇచ్చిన పాపానపోలేదు. పైగా కొత్త కార్డుల్లో పేర్లు జతకావాలంటే పాత కార్డుల్లోని పేర్లను తొలగించుకోవాలంటూ మెలికపెట్టింది. దీనిని నమ్మిన దరఖాస్తుదారులు.. పరుగున వెళ్లి పాత కార్డుల్లో పేర్లు తొలగించుకున్నారు. వెంటనే కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
కానీ.. నెలలు గడిచినా అతీగతీ లేదు. పైగా ఉమ్మడి కుటుంబం నుంచి వేరు పడిన వారి పేర్లను, కొత్త కాపురం పెట్టిన వారి పేర్లను తీసుకొని మళ్లీ ఉమ్మడి కుటుంబంలో చేర్చి జిల్లా ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ఇక సరికొత్త చిక్కులతో దరఖాస్తుదారులకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. కొత్తగా వివాహమైన జంటలు సంతానం కలిగాక రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ సంతానంలో ఒకరి పేరును కార్డులో ఎక్కిస్తోంది. మరొకరి పేరును చేర్చడం లేదు. నలుగురి పేరుతో ఒకేసారి దరఖాస్తు చేసుకుంటే అందులో ఒకరి పేరును ఎలా ఎగరగొడతారంటూ దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు.
ఇక కొత్త కోడళ్ల పరిస్థితైతే ‘రెంటికీ చెడ్డ రేవడి’లా ఉంది. వివాహమై అత్తగారింటికొచ్చిన కొత్త కోడళ్లు తమ అత్తగారి కుటుంబంలోగానీ, లేదా తన భర్తతో వేరుగా గానీ రేషన్ కార్డు కావాలంటూ మీసేవలో దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే అవి ఎప్పటికీ ఆమోదం పొందడం లేదు. నెలల తరబడి వేచి చూసి కార్యాలయాలకు వెళ్లి అధికారులను అడిగితే.. ‘మీ తల్లిగారి కార్డులో మీ పేరు ఉంది. మొదట దానిని తొలగించుకోవాలి. ఆ తరువాత అత్తగారి కార్డులో పేరు జత పర్చేందుకుగానీ, భర్తతో కలిపి కొత్త కార్డు మంజూరుకుగానీ దరఖాస్తు చేసుకోవాలి.
అప్పుడు ప్రభుత్వ ఆమోదం పొందితే నూతన కార్డు వస్తుంది’ అని వివరంగా చెబుతున్నారు. ఈ మాటలు నమ్మిన కొత్త కోడళ్లు పరుగు పరుగున వెళ్లి తమ తల్లిగారి కార్డుల్లో ఉన్న తమ పేర్లను డిలీట్ చేయించుకున్నారు. తిరిగొచ్చి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ.. నెలలు గడిచినా అవి ఆమోదం పొందడం లేదు. దీంతో ఇటు తమ పేర్లు తమ తల్లిగారి కార్డులోనూ లేక, అటు అత్తగారి కార్డులోనూ ఎక్కక ‘రెంటికీ చెడ్డ రేవడి’ అవుతున్నారు.
పైగా ఇటీవల పలు పథకాలకు ప్రభుత్వం రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకోవడంతో ఆయా కార్డులో వీరి పేర్లు లేక సదరు పథకాలను కోల్పోతున్నారు. అదీగాక లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ వాస్తవంగా ఇచ్చినవి మాత్రం అతి స్వల్పంగానే ఉన్నాయి. ప్రజాపాలన, మీసేవల నుంచి చేసుకున్న దరఖాస్తులు అత్యధిక సంఖ్యలో ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అవి అలా ఉండగానే సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం వంటి పథకాలను అమలు చేస్తుండడంతో వాటికి దరఖాస్తు చేసుకునేందుకు అనేకమంది అర్హత కోల్పోతున్నారు.
భాషాఆషా దంపతులేగాక ఇలాంటి తిప్పలను ఉమ్మడి జిల్లాలో ఇంకా ఎందరో దంపతులు ఎదుర్కొంటున్నారు. వేంసూరు చెందిన భాగ్యమ్మది, ఖమ్మం రూరల్‌కు చెందిన నాగరత్తమ్మది, జూలూరుపాడు మండలం చింతలతండాకు చెందిన రాములుది, అదే గ్రామానికి చెందిన పాలూరి రాంబాబుది ఇలాంటి సమస్యే. ఇలాంటి బాధితులు జిల్లాలో ఇంకా వేల సంఖ్యలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న ముప్పుతిప్పల వల్ల తలలు పట్టుకుంటున్నారు.
అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన షేక్ రంజాన్‌బీ-లాల్ అహ్మద్ అనే వారు వృద్ధ దంపతులు. వీరి కొడుకు భాషా. ఇతడికి వివాహమై ఐదారేళ్లు అవుతోంది. అయితే అతడికి వివాహం కాకముందు ఆ వృద్ధ దంపతులైన రంజాన్‌బీ, లాల్ అహ్మద్‌తోపాటు భాషాలకు కలిపి ముగ్గురి పేరుతో రేషన్ కార్డు ఉంది. అయితే ఐదారేళ్ల క్రితం భాషాకు వివాహమైంది. ఆ కుటుంబంలోకి అతడి భార్య ఆషా వచ్చింది. తరువాత భాషాఆషా దంపతులకు పెద్ద కొడుకుగా ఆయాన్, చిన్న కొడుకుగా ఆరిఫ్ జన్మించారు.
కొన్నాళ్లకు భాషా-ఆషా దంపతులు వేరు కాపురం పెట్టుకున్నారు. వారి కుమారులైన ఆయాన్, ఆరిఫ్‌లతో కలిపి భాషా, ఆషా దంపతులు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరి దరఖాస్తును చాన్నాళ్లపాటు పెండింగ్‌లో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల దానిని ఆమోదించింది. ఆన్లైన్లో పరిశీలించుకున్న భాషా-ఆషా దంపతులకు దిమ్మతిరిగింది. భాషాఆషా దంపతులు, వారి ఇద్దరు కుమారులు కలిపి నలుగురి పేరిట కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే.. భాషాఆషా దంపతుల పేర్లతోపాటు వారి చిన్న కుమారుడైన ఆరిఫ్ పేరును తీసుకెళ్లి వృద్ధ దంపతులైన రంజాన్బీలాల్ అహ్మద్‌ల పాత కార్డులో చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.
తాము దరఖాస్తు చేసుకున్న కొత్త కార్డును రేవంత్ సర్కారు ఇవ్వకపోగా.. తమ పెద్ద కుమారుడి పేరును ఎగరగొట్టిందని భాషాఆషా దంపతులు మండిపడుతున్నారు. పైగా వేరు కాపురం పెట్టుకున్న తమ పేర్లను తీసుకెళ్లి ఆ వృద్ధ దంపతుల కార్డులో ఎలా చేరుస్తారంటూ నిలదీస్తున్నారు. తమ పేరిట కొత్త కార్డు ఎప్పుడిస్తారని, అందులో తమ పెద్ద కుమారుడి పేరును ఎప్పుడు చేరుస్తారని భాషాఆషా దంపతులు ప్రశ్నిస్తున్నారు.
నా పేరు బానోతు దీప. మాది ఇల్లెందు పట్టణం. మాకు గతంలో రేషన్ కార్డు ఉంది. ఇప్పుడు మా ఇద్దరి పిల్లల పేర్లు చేర్చడానికి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాం. ఎనిమిది నెలలుగా మాకు బియ్యం ఇవ్వడం లేదు. దీనిపై డీలర్‌ను ప్రశ్నిస్తే.. మీ కార్డు తొలగించారని చెప్పారు. పిల్లల పేర్లు చేర్చాలని దరఖాస్తు చేసుకుంటే.. ఉన్న కార్డు తొలగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మా పిల్లల పేర్లు చేర్చి కొత్త కార్డు ఇచ్చి ఆదుకోవాలి.
రేషన్ కార్డు కోసం ఇప్పటికే పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా. కార్డు అందిస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ మాయగానే ఉన్నాయి. మాకు రేషన్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదు. నిరుపేద కుటుంబాల ప్రజలు రేషన్ కార్డు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ప్రభుత్వం వెంటనే రేషన్ కార్డులు అందించి ఆదుకోవాలి.
– వీరకృష్ణ, అడసర్లపాడు, వేంసూరు మండలం
నాకు పెళ్లయి పిల్లలు ఉన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు వస్తాయన్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు కూడా చేశాను. కానీ.. ఇంతవరకు కార్డు రాలేదు. మానాన్న వాళ్ల కార్డులో మా పేర్లు కలిసి ఉన్నట్లు ఆన్లైన్లో కార్డు నమూనా ఇచ్చారు. మార్పు కోసం మీసేవ సెంటర్‌కు చాలాసార్లు వెళ్లాను. పనులు మానేసి కార్యాలయాల చుట్టూ తిరగడం చాలా ఇబ్బందిగా ఉంది.
-షేక్ భాషా, అన్నపురెడ్డిపల్లి
అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెబితే ఆన్లైన్లో దరఖాస్తు చేశాం. కానీ.. ఇప్పటివరకు ఎలాంటి కార్డు రాలేదు. అధికారులను ఎప్పుడు అడిగినా వస్తుందని చెబుతున్నారే తప్ప కార్డు మాత్రం రావడం లేదు. అసలు కార్డులు ఇస్తారా? లేదా? అనేది ఏదో ఒకటి చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్ని సమస్యలను చూడాల్సి వస్తుందనుకోలేదు.
-ఆకుల నందిని, అయ్యన్నపాలెం, చండ్రుగొండ మండలం