బోనకల్లు, మార్చి 28: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బోనకల్లు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు చింతలచెరువు కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసే విధంగా ప్రభుత్వం తీరు ఉన్నదని ఆరోపించారు.
ఆత్మీయ భరోసా, మహిళలకు రూ.2,500 చొప్పున వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, ఎకరాకు రూ.12 వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పి ఖాతాల్లో డబ్బులు జమ చేయలేదన్నారు. ఇందుకోసం సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కలారు సురేష్, బంధం శ్రీనివాసరావు, తెల్లాకుల శ్రీనివాసరావు, బిల్లా విశ్వనాథం, తెల్లాకుల రజిని, గుగులోతు నరేశ్, శ్రీనివాసరావు, షేక్ సిలార్, బోయినపల్లి వీరబాబు పాల్గొన్నారు.