భద్రాచలం, డిసెంబర్ 23 : ప్రజలు అష్టకష్టాలు పడ్డా పర్వాలేదు గానీ.. గత కేసీఆర్ సర్కారుకు మాత్రం క్రెడిట్ దక్కకూడదన్న ధోరణిలో పాలన సాగిస్తోంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజోపయోగ పనులపై కేసీఆర్ జాడ కూడా ఉండకూడదన్న అక్కసుతో వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే కేసీఆర్ ఆనవాళ్లు చెరుపుకుంటూ వస్తున్నామంటున్న ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు.. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన పనులను కూడా పక్కన పడేస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగు రాష్ర్టాల ప్రజలకు, ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేలా గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నీరుగార్చుతున్నారు. వైద్యం, ఉపాధి, రవాణా వంటి అతి ముఖ్యమైన అంశాల్లో నాలుగు రాష్ర్టాల ప్రజలకు మూలస్తంభంగా ఉన్న తెలంగాణలోని భద్రాచలాన్ని మూలనపడేస్తున్నారు. కేసీఆర్ మీద ఉన్న కక్షతో ప్రజలను, ప్రయాణికులను కష్టాలపాలు చేస్తున్నారు.
భద్రాచలంలో ఆర్టీసీ అంతర్ రాష్ట్ర డిపో ఏర్పాటు కోసం నాలుగు రాష్ర్టాల ప్రజలు, ప్రయాణికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ ఇబ్బందులను గుర్తించిన తెలంగాణలోని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం.. ఒడిశా రాష్ట్ర ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఎండీ సజ్జనార్‌లు ఒడిశా ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎంవోయూ పత్రాలు మార్చుకున్నారు. ఆ తరువాత తెలంగాణలో ప్రభుత్వం మారడంతో ఒప్పందానికి బ్రేక్ పడింది. తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గత కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను పక్కకు పెట్టింది. దీంతో నాలుగు రాష్ర్టాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రగిరిలోని భద్రాచలం బస్టాండ్ తెలంగాణతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు కేంద్ర బిందువుగా ఉంది. నాలుగు రాష్ర్టాలకు అనుసంధానంగా బస్సు సేవలను అందిస్తూ ప్రయాణికులకు చేరువైంది. ఏటా ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో భద్రాద్రికి వచ్చి వెళ్లే భక్తులకు సేవలందిస్తోంది. ఇక ఆయా రాష్ర్టాల్లోని ఏజెన్సీ ప్రాంత గిరిజనులు వైద్యసేవలు, ఇతర అవసరాలకు భద్రాచలమే ప్రధానం కావడంతో ఆయా రాష్ర్టాల నుంచి బస్సుల రాకపోకలు అధికం, అనివార్యం అయ్యాయి. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వ చొరవ లేకపోవడం, సరైన సర్వీసులు రాకపోవడం వంటి కారణాలతో అంతర్రాష్ట్ర డిపో గుర్తింపు అంశం.. ఆయా రాష్ర్టాల ప్రజల కలగానే మిగిలిపోయింది. దీంతో నాలుగు రాష్ర్టాల ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వీరి ఇబ్బందులను ఆసరా చేసుకుంటున్న ప్రైవేటు బస్సుల యజమానులు తెలంగాణ ఆర్టీసీ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు.
భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను క్రమంగా తగ్గిస్తుండడంతో ప్రగతి రథచక్రాలు ప్రయాణికులకు దూరమవుతున్నాయి. భద్రాచలం మద్రాసుకు గతంలో ఉన్న సర్వీసును రద్దు చేశారు. బెంగళూరుకు బస్సుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నా స్పందన లేదు. మరోపక్క హైదరాబాద్‌కు ఇటీవల ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టినా ప్రయాణికుల రద్దీకి తగిన సంఖ్యలో సర్వీసులు ఉండడంలేదు. భద్రాచలం-హైదరాబాద్ సర్వీసులను సైతం చాలావరకు కుదించారు. హైదరాబాద్‌లో మెట్రో రైలుకు ఆదరణ పెరిగిందనే కారణంతో కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ వరకు నడిపే బస్సులను ఎంజీబీఎస్ వరకే పరిమితం చేశారు.
అంతర్రాష్ట్ర డిపో ఏర్పాటు విషయంలో ముందుండి చొరవ తీసుకోవాల్సిన తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడడం లేదు. గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలో చేసుకున్న ఒప్పందాలపై ముందుకెళ్లడం లేదు. ఒకవేళ గత ప్రభుత్వ ఎంవోయూలను అమలు చేస్తే ఆ ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందుతుందన్న కారణంతోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలుకు ముందడుగు వేయడం లేదని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. కానీ.. గత కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న కోపంతో తమనెందుకు ఇబ్బందులు పాలు చేస్తున్నారంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. అందుకే గతంలో తెలంగాణ, ఒడిశా ఆర్టీసీ సంస్థలు చేసుకున్న ఒప్పందాలు కేవలం పత్రాలకే పరిమితమయ్యాయని ఆరోపిస్తున్నారు.