ఖమ్మం, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతన్నలకు తిప్పలు మొదలయ్యాయి. ఆంధ్రా పాలకుల సమయంలో కనిపించిన దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. నేటి కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే అన్నదాతలు చుక్కలు చూస్తున్నారు. యూరియా కోసం పాడరాని పాట్లు పడుతున్నారు. సహకార సొసైటీల వద్ద నిత్యం పడిగాపులు కాస్తున్నారు. అధికారులేమో యూరియా ఇంకా రాలేదని తాపీగా సమాధానం చెప్పి పంపిస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న ఖమ్మం జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉందంటే.. రాష్ట్రంలో పరిస్థితి వేరేచెప్పనక్కరలేదు. బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో ఎక్కడా ఇబ్బంది కలిగిన సందర్భాలు లేకపోవడంతో రైతులు ఆ రోజులను గుర్తు చేసుకుంటున్నారు.
ఇంతకాలం వర్షాల కోసం ఎదురుచూసిన రైతులకు ఇప్పుడు ఎరువుల కోసమూ ఎదురుచూపులు తప్పడం లేదు. ఖమ్మంజిల్లావ్యాప్తంగా వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. పత్తి, మొక్కజొన్న, ఇతర అపరాల పంటలు మొలకెత్తాయి. ఈ తరుణంలో పంటలకు అవసరమైన ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో 5.56 లక్షల ఎకరాల్లో సాగుభూమి ఉండగా.. ఇప్పటికే 2.76 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది 2.21 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.
వరి 2.83 లక్షల ఎకరాలు, 12 వేల ఎకరాల పైచిలుకు పెసలు, 15 వందల ఎకరాల్లో మొక్కజొన్న, 41 ఎకరాల్లో చెరుకు, 42 ఎకరాల్లో వేరుశనగ, 53 ఎకరాల్లో మినుములు, 131 ఎకరాల్లో కంది సాగు చేయనున్నారు. ఈ వానకాలం సీజన్లో ఖమ్మం జిల్లాకు 60,716.50 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా.. మార్క్‌ఫెడ్, వేర్‌హౌజ్ గోదాముల్లో 27,894 మెట్రిక్ టన్నులు సిద్ధంగా ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కానీ.. ఆ యూరియాను సహకార సొసైటీలకు సరఫరా చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతున్నది. దీంతో రైతులు పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది.
సీజన్‌కు ముందస్తుగానే జిల్లాకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ.. కాంగ్రెస్ సర్కార్ తన బాధ్యతను విస్మరిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా ఉంటోంది. ప్రభుత్వం చెప్పేది ఒకటైతే చేసేది మరొకటి అన్నట్లు కనిపిస్తున్నది. జిల్లాలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కానీ.. దుకాణాల వద్దకు వెళ్తే కావాల్సిన ఎరువులు దొరకడం లేదు. ఈ విషయమై అధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.
ఖమ్మం జిల్లాలో యూరియా కోసం రైతులు సహకార సొసైటీల చుట్టూ కాళ్ల చెప్పులరిగేలా తిరుగుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినంక పాత రోజులు పునరావృతం అయ్యాయని రైతులు వాపోతున్నారు. సొసైటీల్లో రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో లేకపోవడంతో నిత్యం కార్యాలయాలకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఈ ఏడాది రైతులకు అవసరమైన యూరియా కోసం ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టామని, ఇంకా రాలేదని అధికారులు చెబుతున్నారు. గతంలో ఉన్న కూసింత స్టాక్‌ను రైతులకు ఇచ్చి చేతులు దులుపుకుని, స్టాకు లేదనే సమాధానం చెబుతున్నారు. అనేక సొసైటీలకు ఈ ఏడాది పెట్టుకున్న యూరియా ఇండెంట్ ఇంకా చేరలేదనేది సొసైటీ అధికారుల ద్వారా తెలుస్తున్నది.
యూరియా, డీఏపీ అమ్మకాల్లో వ్యాపారులకు పలు రకాల ఆంక్షలు విధించడంతో షాపుల్లో స్టాకు పెట్టుకోవడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. అమీనా యాసిడ్, యూరిక్ యాసిడ్ వంటి గుళికలను నానో యూరియా, నానో డీఏపీలకు లింకు చేయడంతో నష్టపోతున్నామని పురుగుల మందులు, ఎరువుల విక్రయ వ్యాపారులు వాపోతున్నారు. గుళికలు అవసరమైనప్పటికీ రైతులకు వాటి వినియోగం తెలియకపోవడం, వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించకపోవడంతో కొనుగోలు చేయడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎరువుల అమ్మకానికి గుళికలను రైతులకు విక్రయించాలనే అధికారుల నిబంధనతో జిల్లావ్యాప్తంగా ఎరువుల అమ్మకాలను నిలిపివేస్తున్నామని వ్యాపారులు పేర్కొంటున్నారు.
దీనిపై శుక్రవారం జిల్లాలోని పురుగుల మందుల వ్యాపారులంతా ఖమ్మంలో సమావేశమైనట్లు తెలిసింది. ఈ మేరకు షాపుల్లో విక్రయాలను నిలిపివేసే దిశగా నిర్ణయించుకోనున్నట్లు సమాచారం. కాగా.. పత్తి, పెసర, మొక్కజొన్న పంటలు ఏపుగా ఎదుగుతున్న తరుణంలో యూరియా, పొటాష్ కాంప్లెక్స్ ఎరువుల అవసరం. వీటితోపాటు వరినారు మళ్లకు 20-20-0-13, 20-20 ఎరువులు అవసరం. పత్తి పెరుగుదల సమయంలో పొటాష్ వాడకంతో పూత, కాత అధికంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పొటాష్ సమృద్ధిగా ఉన్నప్పటికీ డీఏపీ, యూరియా కొరత తీవ్రంగా ఉంది.
ప్రైవేటు దుకాణాల్లో కూడా యూరియా లేదంటున్నారు. బ్లాక్‌లో విక్రయాలు చేసేందుకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. గతంలో సహకార సంఘంలో లేకపోయినా ప్రైవేటు వ్యాపారుల వద్ద యూరియా కొనుగోలు చేసేవాళ్లం. అదును సమయంలో ఎరువులు వేయకపోతే తీవ్రంగా నష్టపోతాం.
– యనగంటి బోడయ్య, రైతు, చిన్నబండిరేవు, దుమ్ముగూడెం మండలం