యూరియా కోసం అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతూనే ఉన్నారు. వానకాలం సీజన్ ప్రారంభం నుంచీ అవే ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీచేయలేక చోద్యం చూస్తున్నది. పంటలను కాపాడుకునే ఉద్దేశంతో తెల్లవారుజాము నుంచే అన్నదాతలు ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నారు. సొసైటీ, ఎరువుల గోడౌన్ల వద్ద రోజంతా క్యూలో ఉండే ఓపికలేక చెప్పులను లైన్లో ఉంచి మరీ పొద్దంతా వేచి చూస్తున్నారు. వచ్చిన అరకొర యూరియా బస్తాలు కొంతమంది వరకే అందుతుండడంతో క్యూలో ఉన్న మిగతా రైతులు ఆందోళన చేస్తున్నారు. తమ పంటల పరిస్థితి ఏమిటని, తమ గోడును ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు కష్టపడి పండించే పంటలకు కనీసం యూరియా సైతం అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మణుగూరు టౌన్, ఆగస్టు 30 : పత్తి పంట పూత, కాత దశలో ఉంది.. వరి పంట కలుపుతీసే దశలో ఉంది.. మొక్కజొన్న పంట మధ్య వయస్సుకు వచ్చేసింది.. ఈ సమయంలో సరైన ఎరువులు వేయకపోతే పంటలు ఆశించిన దిగుబడి రావు. దీనికితోడు వర్షాలు జోరుగా పడుతుండడంతో భూమిలో తేమశాతం ఎక్కువైపోయి పంట రొట్టబారుతున్నది. ఈ సమయంలో ఎరువులు వేయకపోతే ఎదుగుదల లోపించి పూత, కాత రాలిపోతుంది.. ఇది చూసి రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎరువుల కోసం సొసైటీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూ కడుతున్నారు.
సాయంత్రం వరకు క్యూలో నిల్చునే ఓపికలేక చెప్పులు పెట్టి మరీ అక్కడే వేచి ఉంటున్నారు. శనివారం తెల్లవారుజామున 4గంటల నుంచే మణుగూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద మణుగూరు మండలంలోని రైతులు బారులు తీరారు. గంటల తరబడి నిల్చునే ఓపిక లేకపోవడంతో తమ చెప్పులను క్యూలో ఉంచి తమవంతు వచ్చినప్పుడు వెళ్లి నిలబడుతున్నారు. తిండి కూడా సరిగా తినక యూరియా బస్తాల కోసం అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కావాల్సినంత ఎరువులు అందించారని, ఏరికోరి మార్పు కావాలని కాంగ్రెస్ను గెలిపిస్తే తమను నిలువునా మోసం చేసిందని అన్నదాతలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.
చండ్రుగొండ, ఆగస్టు 30 : మండల పరిధిలోని గానుగపాడు సొసైటీ కార్యాలయంలో రైతులు యూరియా కోసం ఆందోళన చేశారు. శనివారం తెల్లవారుజాము నుంచే యూరియా కోసం రైతులు చెప్పులను క్యూలో ఉంచి పడిగాపులు కాశారు. వందలాది మంది రావడంతో పోలీసులు వచ్చి రైతులను క్యూలో ఉండాలని హుకుం జారీ చేశారు. క్యూలో ఉంచిన రైతుల చెప్పులను ఎవరివి వారు వేసుకోవాలని ఆదేశించారు. అనంతరం రైతులు క్యూలో ఉండటం వల్ల గందరగోళం ఏర్పడింది.
చంటిబిడ్డలతో మహిళా రైతులు యూరియా కోసం పడిగాపులు కాయటం అందరిని కలచివేసింది. యూరియా గంటలోనే అయిపోవడంతో రైతులు సొసైటీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. క్యూలో ఉన్నవారికి ఒక్క కట్ట యూరియా చొప్పున 60 మందికే ఇవ్వటంపై మిగతా రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు ఎరువులను అందించలేని ప్రభుత్వం ఎందుకని, పోలీసుల పహారాలో యూరియాను సరఫరా చేయడం గతంలో ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల చెప్పులను క్యూలో ఉంచేలా చేసిన ప్రజాప్రతినిధులు సిగ్గుపడాలన్నారు.
పినపాక, ఆగస్టు 30 : పినపాక మండలం మొత్తానికి ఏడూళ్ళబయ్యారం క్రాస్రోడ్లో ఉన్న ప్రాథమిక సంఘం పరపతి సంఘం కార్యాలయం ఒకటే దిక్కు. శనివారం సహకార సంఘ కార్యాలయానికి యూరియా కోసం వచ్చిన రైతులు క్యూలో చెప్పులు పెట్టి మరీ పొద్దంతా నిలబడి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంటలకు సరిపడా యూరియా ఇవ్వాలని సీపీఎం జిల్లా నాయకుడు నిమ్మల వెంకన్న ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పాలకులు రైతులకు అవసరమైన యూరియాలో సగం కూడా సరఫరా చేయడం లేదని ఆరోపించారు. వచ్చిన యూరియాను కొందరు నేతల అండతో బడాబాబులు, అధికారులు నల్లబజారుకు తరలిస్తున్నారని మండిపడ్డారు.