రఘునాథపాలెం, మే 31 : కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేవన్నీ ఝూటా మాటలే. గోరంత పనికి కొండంత ప్రచారం చేసుకోవడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారింది. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ.. ‘తానా’ అంటే ‘తందానా..’ అంటూ భజన చేయడం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంతైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి చేసిన పనికి ‘పది’ంతలు గొప్పలు చెప్పుకోవడం పరిపాటిగా మారింది. రైతులకు అమలు చేస్తామన్న రుణమాఫీ దగ్గర్నుంచి మొదలుకొని ధాన్యం కొనుగోలుకు క్వింటాపై ఇస్తామన్న రూ.500 బోనస్ వరకు.. ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో పక్కాగా అమలు చేసింది లేదు.
ఇప్పుడు రైతుభరోసా విషయంలోనూ ఇదే రుజువైంది. మరికొద్ది రోజుల్లో వానకాలం సాగు ప్రారంభం కాబోతున్నా.. గడిచిన యాసంగి సీజన్‌కు సంబంధించిన పంటల పెట్టుబడి సాయాన్ని రెండెకరాలకు మాత్రమే పరిమితం చేశారు. ఆపైన సాగుభూమి ఉన్న రైతులందరూ పంటల పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, వానకాలం సీజన్ సమీపిస్తే.. గత యాసంగికి సంబంధించి రెండుకరాలకు పైబడిన భూమి ఉన్న రైతులకు అందించే రైతుభరోసాకు ఎగనామం పెట్టినట్లేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
‘రైతులకు బిచ్చమేసినట్లుగా రైతుబంధు కింద సీఎం కేసీఆర్ ఎకరానికి రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నారు. మేం అధికారంలోకి వస్తే రైతుభరోసా పథకం కింద ఎకరానికి రూ.15 వేలు ఇచ్చి రైతు గౌరవాన్ని నిలబెడతాం.’ అంటూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. తాను అధికారంలోకి వచ్చాక అన్నదాతలను అన్ని విధాలా అరిగోస పెడుతున్నారు. చివరికి ఆయన హామీ ఇచ్చిన విధంగా రైతుభరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇవ్వకుండా మోసం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎకరానికి రూ.12 వేలు మాత్రమే ఇస్తామంటూ కాడెత్తేశారు. అది కూడా సక్రమంగా ఇవ్వకుండా ఎకరాల చొప్పున కోతలు పెడుతున్నారు.
రైతుభరోసా విషయంలో ప్రతిపక్షాలు ప్రశ్నించినా, అమలు చేసినట్లు నిరూపించాలని సవాలు విసిరినా.. ప్రభుత్వంలోని పెద్దలకు చీమకుట్టినట్లయినా ఉండదు. పైగా మళ్లీ మళ్లీ అదే విధానాన్ని అవలంబిస్తూ అన్నదాతలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. పెట్టుబడి సాయంగా రైతులకు అందించే ‘రైతు భరోసా’ విషయంలోనూ రేవంత్ సర్కార్ ఇదే తీరును అవలంబిస్తోంది. గత యాసంగి భరోసాను కేవలం రెండెకరాలకే పరిమితం చేసి చేతులు దులుపుకుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం యాసంగి భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఏప్రిల్ 20న వరంగల్ జిల్లా నస్తూరిపల్లి బహిరంగ సభలో యాసంగి రెండో విడతకు సంబంధించి ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులందరికీ రైతుభరోసా నిధులు జమ చేస్తున్నట్లు ప్రకటించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మాయ మాటలు చెప్పి తెలంగాణ రైతులను మోసం చేశారు.
గత రెండున్నరేళ్లుగా వానకాలం, యాసంగి సీజన్లు ప్రారంభమైన ప్రతిసారీ జిల్లా రైతులందరూ పంటల పెట్టుబడి సాయం కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురుచూస్తున్నారు. కానీ ఎప్పుడూ వారికి నిరాశే మిగులుతోంది. ఏ సీజన్లోనూ రైతులకు పూర్తిస్థాయిలో పంటల పెట్టుబడి సాయం అందించిన దాఖలాలు లేవు. పైగా, ఎగనామం పెట్టిన సందర్భాలే ఎక్కువ. ఇక గత యాసంగి రైతు భరోసాలో నెలల తరబడి రైతులను నిరీక్షింపజేశారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఎన్ని ఎకరాలు ఉన్న రైతుకైనా మొదట దఫాలో ఒక ఎకరం చొప్పున ఒక సీజన్‌కు రూ.6 వేలు, రెండో దఫాలో మరో ఎకరం చొప్పున మరో రూ.6 వేలు జమ చేశారు. ఆ తరువాత నిధుల జమ ప్రక్రియను నిలిపివేశారు.
దీంతో ఆ తరువాతి రైతులకు రైతుభరోసా నిలిచిపోయింది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ‘రైతుబంధు’ పథకం కింద నగదు జమ చేయడం ప్రారంభమైతే మొదటి రోజు ఎకరంలోపు విస్తీర్ణమున్న రైతులకు, రెండో రోజు రెండెకరాల్లోపు విస్తీర్ణమున్న రైతులకు, మూడో రోజు మూడు ఎకరాల్లోపు విస్తీర్ణమున్న రైతులకు పూర్తిస్థాయిలో రైతుబంధును జమ చేస్తూ వచ్చేవారు. అయితే, ప్రసుత్తం రేవంత్ సర్కారు అవలంబిస్తున్న విధానంతో రైతులకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కేసీఆర్ పాలనలో రైతుబంధు నిధులు సీజన్ ముందే జమ అయిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈ విషయపై రైతులు, ప్రతిపక్షాలు ప్రశ్నించకుంటే కొన్నాళ్లకు రైతులందరికీ యాసంగి సీజన్ రైతుభరోసా ఇచ్చామనే చెప్పుకుంటారేమోనంటూ రైతులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎద్దేవా చేస్తున్నారు.
రైతులు అప్పులు చేసి వ్యవసాయం చేయకూడదనే ఉద్దేశంతో గత కేసీఆర్ సర్కార్ ‘రైతు బంధు’ పథకాన్ని తీసుకొచ్చింది. పంటల పెట్టుబడి సాయంగా ప్రతి సీజన్‌కూ రూ.5 వేల చొప్పున వానకాలం, యాసంగి సీజన్లకు కలిపి ఎకరానికి రూ.10 వేలు అందించింది. కరోనా వంటి కష్టకాలంలోనూ రైతుబంధు నిధుల జమను కొనసాగించింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతుబంధు పథకానికి రైతు భరోసాగా నామకరణం చేశారు. కానీ ఏ సీజన్లోనూ సక్రమంగా అందించిన పాపానపోలేదు. మఖ్యంగా యాసంగి సీజన్లో మాత్రం బ్రేకులు వేసుకుంటూ వస్తోంది. గత యాసంగిలోనూ భరోసాకు పూర్తిగా ఎగనామం పెట్టింది. ఈ యాసంగిలో మాత్రం రెండెకకాలకే పరిమితం చేసింది.
ఖమ్మం జిల్లాలో యాసంగి సీజన్లో జిల్లాలో మొత్తం 3,43,997 మంది రైతులు ఉండగా వీరిలో రెండెకరాల్లోపు రూ.270.94 కోట్లు రైతు భరోసా కింద జమైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండెకరాలకు పైన ఉన్న రైతులకు ఇంకా రైతు భరోసా జమ కావాల్సి ఉంది. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఇంకా రూ.164 కోట్ల పైచిలుకు ఖమ్మం జిల్లాలో రైతు భరోసా పథకం కింద రైతులకు యాసంగి పెట్టుబడి సాయం అందాల్సి ఉంది. యాసంగి సీజన్ ముగిసి.. త్వరలో వానకాలం సాగుకు రైతులు సిద్ధమవుతున్నా వారికి ఇంకా పెట్టుబడి సాయం అందించడం లేదు.
గత యాసంగిలోనూ రెండెకరాల విస్తీర్ణానికి మించి ఉన్న రైతులకు జమ చేయలేదు. దీంతో రెండెకరాలకు పైబడి ఉన్న రైతులకు రైతుభరోసా అందడం కష్టమేని పలువురు రైతులు అనుకుంటున్నారు. అయితే, రైతు భరోసా జమ చేయకపోగా.. కాంప్లెక్స్ ఎరువుల ధర బస్తాకు రూ.300 నుంచి రూ.400 వరకు పెంచింది ప్రభుత్వం. ఇటు యాసంగి భరోసా పడక, రైతు భరోసా డబ్బులు రాక రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వానకాలం సాగు పెట్టుబడి కోసం రైతులు ప్రైవేటు అప్పుల కోసం వెతుకులాడుతున్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలోనే రైతుబంధు పంటల పెట్టుబడి సాయం రైతులకు సకాలంలో అందేది. వ్యవసాయ సీజన్‌కు ముందుగానే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేవారు. వాటిని మేం ఎరువులు, విత్తనాలకు ఉపయోగించుకునే వాళ్లం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుభరోసా డబ్బులు వస్తాయన్న నమ్మకం పోయింది. రెండు సీజన్లకు పూర్తిగా ఎగ్గొట్టారు. యాసంగి సీజన్లో కేవలం రెండు ఎకరాలకే అందించారు. అది కూడా అప్పుడో ఎకరానికి.. ఇప్పుడో ఎకరానికి జమ చేశారు. అలా రూ.6 వేల చొప్పున కొంచెం కొంచెంగా జమ చేస్తే అవి అక్కరకు రాకుండా పోయాయి. సీజన్ ఆరంభంలోనే రైతు భరోసా అందిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.
-గాదె వెంకటరెడ్డి, రైతు, చిమ్మపూడి