రఘునాథపాలెం, ఏప్రిల్ 13 : యాసంగి సీజన్ పూర్తికావొచ్చింది. వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు సైతం ప్రారంభమయ్యాయి. ‘రైతుభరోసా’ మాత్రం పూర్తిస్థాయిలో అందనేలేదు. అంటే పేదలకు సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఇట్టే అవగతం చేసుకోవచ్చు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటినుంచి నేటివరకు రైతుభరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందింది. రైతుభరోసా పథకానికి మంగళం పాడాలనే ఆలోచనలో ఉన్నదనే ప్రచారమూ సాగింది. ఇదిగో.. అదిగో అంటూ ఆశ పెడుతూ చివరికి ‘చేయి’స్తోంది.
ఈ ఏడాది యాసంగి రైతుభరోసా సాయంపై అన్నదాతలు కన్నెర్ర చేయడంతో గందరగోళంలో పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి గత నెల 22న తొలివిడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. మూడు విడతల్లో రైతుభరోసా అందిస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. తొలివిడతగా ఒక్క ఎకరానికి మాత్రమే రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాలకు రిలీజ్ చేశారు. 15 రోజుల తర్వాత రెండోవిడత అందిస్తామని చెప్పారు. దీని ప్రకారం ఏప్రిల్ మొదటివారంలోనే అందాల్సి ఉంది. కానీ ఇరవై రోజులు దాటినా ఇంకా అమలుకు నోచుకోలేదు. ఇచ్చిన మాటను తప్పడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటేనంటూ రైతులు పెదవి విరుస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు కష్టాలు తెలిసిన నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సీజన్‌కు ముందుగానే పంటల పెట్టుబడి సాయాన్ని ఠంఛన్‌గా రైతుల ఖాతాల్లో జమ చేసేవారు. పంటల పెట్టుబడి కోసం గ్రామాల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ పాత రోజులను గుర్తుచేస్తున్నారు. అప్పుల కోసం పల్లెల్లో సేట్లను ఆశ్రయించాల్సిన పరిస్థితిని తెచ్చారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే గిట్ల ఉంటది’ అంటూ పల్లెల్లో రైతులు కూడా చర్చించుకుంటుండడం గమనార్హం.
రైతుభరోసా అమలులో జాప్యం కారణంగా సన్న, చిన్నకారు రైతులకే అత్యధికంగా నష్టం వాటిల్లుతోంది. పంటల పెట్టుబడి సాయంతో నష్టాలు పూడ్చుకొని గట్టెక్కే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రైతుభరోసా యాసంగి సీజన్ 2026లో తొలివిడత ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఒక్క ఎకరానికి రూ.6 వేల చొప్పున 3.58 లక్షల మంది రైతులకు రూ.440.63 కోట్లు జమ చేశారు. చిన్న, సన్నకారు రైతులకు గ్రామాల్లో 2 నుంచి ఐదెకరాల సాగు భూమి ఉంది. వీరికి వ్యవసాయమే జీవనాధారం. అయితే, రెండో విడత ద్వారా తమకు పూర్తిస్థాయిలో పెట్టుబడి సాయం అందించాలని సామాన్య రైతులు కోరుతున్నారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ యాసంగి సీజన్‌కు పంట పెట్టుబడి సాయంగా ఇస్తామని చెప్పిన మిగిలిన రెండు, మూడు విడతల రైతుభరోసా ఆర్థిక సాయంపై రైతులకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయా విడతలు ఇవ్వకుండానే ఇచ్చామంటూ ప్రచారం చేసుకున్నా అనుమానం లేదనే మాటలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యాసంగి సీజన్ రైతుభరోసా డబ్బులను తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామంటూ చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో చూస్తే కేవలం రైతులందరికీ కేవలం ఎకరానికే, అది కూడా రూ.6 వేల చొప్పునే గత నెల 22న ఖాతాల్లో జమచేశారు.
మిగిలిన ఎకరాలకు అందాల్సిన పంటల పెట్టుబడి సాయాన్ని రెండు, మూడు విడతల్లో జమ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించగా.. వ్యవసాయశాఖ మంత్రి మాత్రం 9 రోజుల్లోనే రైతుభరోసా నగదును రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మాటలను బట్టి చూస్తుంటే యాసంగి సీజన్ కింద ఇంకా రావాల్సిన రైతుభరోసా సాయం ఇక ఎగ్గొట్టినట్లేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనినిబట్టి రైతుభరోసా పథకాన్ని అమలు చేయడంలో కిందాపైనా పడుతున్న రేవంత్ సర్కార్.. భవిష్యత్తులో అసలు ఏకంగా పథకానికి మంగళం పాడుతుందనే అనుమానాలను కూడా రైతులు వ్యక్తం చేస్తున్నారు.