మామిళ్లగూడెం, సెప్టెంబర్ 18 : ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరు పేదలు ‘పింఛనివ్వు.. నీ బాంచన్’ అని చేయిచాచే దుస్థితి ఏర్పడు తోంది. నాడు ఉమ్మడి రాష్ర్టాన్ని 60 ఏళ్లు పాలించిన నాటి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు నిరుపేదలను నిర్లక్ష్యం చేశాయి. రాజకీయ అండదండలున్న వారికి, ముడుపులు చెల్లించిన వారికే పింఛన్ ఇచ్చేవి. పేదలను విస్మరించేవి. నేడు తెలంగాణలో తిరిగి కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాత నాటి ఉమ్మడి రాష్ట్ర పాలన ప్రజలకు గుర్తుకు వస్తోంది. రాష్ట్రం సాధించుకున్న తరువాత నిరుపేదల పింఛన్ కష్టాలను తీర్చాలన్న తలంపుతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పథకానికి రూపకల్పన చేశారు.
అంగవైకల్యం ఉన్న వారికి సంఘ సేవకుడిగా, వృద్ధులకు బాధ్యత గల కొడుకుగా, వితంతువులు, ఒంటరి మహిళలకు ఓదార్పునిచ్చే అన్నగా, చేనేతన్నల, గీతన్నల కష్టాలు తెలిసిన కార్మికుడిగా, బోదకాలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చేయూతనిచ్చే స్నేహితుడిగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పథకాన్ని 2014 అక్టోబర్‌లో ప్రకటించారు. నిరుపేదల సంక్షేమం, సాంఘిక భద్రత కల్పించడంలో గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. నిరాదరణకు గురవుతున్న వారికి సామాజిక భద్రతతో ‘ఆసరా’ ద్వారా సహకారం అందించారు. కానీ, నేడు ఆ పరిస్థితి తలకిందులైంది.
నేడు సమాజంలో నిరాదరణకు గురవుతున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వ్యాధిగ్రస్తులు, చేనేత, గీత కార్మికులు కనీసం రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి కూడా ప్రస్తుతం అందిస్తున్న పింఛన్లు సరిపోవడం లేదు. తాము అధికారం చేపట్టిన వెంటనే పింఛన్లను దివ్యాంగులకు రూ.6 వేలు, మిగిలిన పింఛన్‌దారులకు రూ.4 వేల వరకు పింఛన్లు పెంచుతామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, అధికారం చేపట్టి రెండేళ్లు కావొస్తున్నా పింఛన్లు మాత్రం పెంచలేదు. హామీని నిలబెట్టుకోలేదు. ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లతో పెరుగుతున్న ధరలు, క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితుల వల్ల నిరుపేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారులు, దరఖాస్తుదారులను పట్టించుకునే పరిస్థితి లేదు. అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా నేటికీ బక్కచిక్కిన ప్రాణాలకు పింఛన్ల పెంపు ఊసే ఎత్తడం లేదు. పైగా కొత్త పింఛన్ల మంజూరుకు దిక్కే లేకుండా పోయింది. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు రాష్ట్ర క్యాబినెట్లో కీలక పదవుల్లో ఉన్నప్పటికీ పేదల ఆకలి తీర్చే పరిస్థితి లేదు. అన్ని అర్హతలూ ఉన్న తమకు ఇప్పటికైనా పింఛన్ మంజూరు చేయకపోతారా అనే ఆశతో జిల్లాలో సుమారు 4,560 మంది నూతన దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ ఏర్పడిన తరువాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న పింఛన్‌కు ఎలాంటి ఆంక్షలూ పెట్టలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించింది. జిల్లాలో ఎప్పటికప్పుడు గ్రామస్థాయిలో అర్హులను గుర్తించి పింఛన్లు మంజూరు చేసేది. రాజకీయ ఒత్తిళ్లకు చోటులేకుండా పారదర్శకంగా పింఛన్ లబ్ధిదారుల ఎంపిక ఉండేది. నేటి వరకు జిల్లాలో 1,85,644 మంది పింఛన్‌దారులకు రూ.30.02 కోట్లు పింఛన్ రూపంలో అందుతున్నాయి. ఈ పింఛన్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినవే. కానీ, సుమారు రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నేటికీ కొత్తగా ఎలాంటి పింఛన్లూ మంజూరు చేయలేదు. ఎన్నికల హామీ అయిన పింఛన్ల పెంపును తుంగలో తొక్కారు.
జిల్లాలో అర్హత ఉన్న లభ్ధిదారుల నుంచి కొత్త దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. మండలస్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు దరఖాస్తులను పరిశీలించి జాబితాలను సిద్ధం చేస్తున్నారు. మరణించిన పింఛన్ లబ్ధిదారుడి స్థానంలో వితంతు పింఛన్లు మంజూరు చేస్తున్నాం. కొత్త పింఛన్ల మంజూరు, పెంచడం వంటి అంశాలపై రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
-ఎన్.సన్యాసయ్య, డీఆర్డీవో, ఖమ్మం