ఖమ్మం, జూలై 9: ఖమ్మం మున్నేరుకు ఇరువైపులా నిర్మిస్తున్న కరకట్టను త్వరగా పూర్తిచేయాలని కోరుతూ ముంపు ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మం నగరం 48వ డివిజన్లోని పద్మావతినగర్, వెంకటేశ్వరనగర్, గణేష్‌నగర్, సారథినగర్ ప్రాంత ప్రజలు స్థానిక బైపాస్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ తోట రామారావు మాట్లాడుతూ గత ఏడాది మున్నేరు ప్రవాహంతో ఈ ప్రాంత ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన కరకట్ట నిర్మాణాన్ని పూర్తిచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోళ్ళపాడు చానల్ ఆధునీకరణలో భాగంగా నిర్మిస్తున్న కాలువ వల్ల ఈ ప్రాంత ఇండ్లు పూర్తిస్థాయిలో మునిగిపోయే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వంగాల వెంకట్, చేతి కృష్ణ, కిషన్‌నాయక్, బాబా, కునుపూరి మహేష్, మధు, మోటే కుమార్, ప్రభాకర్, సత్యం, నవీన్, గౌస్, శ్రీను, ఉపేందర్, సాగర్, విజయ్, నిర్వాసితులు పాల్గొన్నారు.