ఖమ్మం, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తమ ‘హస్త’వాసితో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నా.. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదనేది లబ్ధిదారుల లేఖలనుబట్టి స్పష్టమవుతోంది. ఇంటికి కావాల్సిన ఖాళీ స్థలం ఉంటే నిర్మాణానికి అవసరమైన డబ్బులు ఇస్తాం.. అంటూ పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసినా పలువురు ఇంటి నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా.. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలాన్ని చెప్పుకోవచ్చు.
‘ఇందిరమ్మ ఇళ్లు’ మాకొద్దంటూ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో పలువురు లబ్ధిదారులు అధికారులకు లేఖలు రాయడం కనిపిస్తోంది. ఇళ్ల విషయంలో లబ్ధిదారులు తీసుకుంటున్న నిర్ణయం మండలంలో చర్చనీయాంశంగా మారింది. ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం ప్రారంభించిన నాటి నుంచి లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలదే పైచేయిగా నిలిచింది. లబ్ధిదారుల ఎంపికలో కమిటీలు చెప్పిన వారి పేర్లనే అధికారులు ఫైనల్ చేశారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. పలుచోట్ల ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలు పార్టీలు ఆందోళనలు చేసిన సంగతి విదితమే. అయినప్పటికీ ఇందిరమ్మ కమిటీలు పంపించిన జాబితానే అధికారులు ఓకే చేశారు.
అయితే ఇందిరమ్మ ఇళ్లు వస్తే కట్టుకుంటారా..? లేదా..? అనేది తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల పథకం ఉద్దేశం పక్కదారి పడుతోందనే విమర్శలు గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నాయి. ఇళ్లు కట్టుకుంటామని నెత్తీనోరూ బాదుకుంటూ.. నేతల చుట్టూ తిరిగినోళ్లను ఎంపిక చేయకుండా.. మా పార్టీ వాళ్లనే ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు జాబితాలో పేర్లు చేరిస్తే ఇప్పుడు విమర్శలు ఎదుర్కోక తప్పడం లేదు. అయితే మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులను అధికారులు కలిసి ఇళ్లు కట్టుకోవాలని అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు.
జాబితా తయారీ సమయంలో అధికారులను బాధ్యులను చేసి కట్టుకుంటారా..? లేదా..? అనే కచ్చితమైన ఆదేశంతో జాబితాలో పేర్లు చేరిస్తే ఈ తప్పిదం జరిగేది కాదు కదా అని పలు గ్రామాల్లో ఇళ్లు కట్టుకునేందుకు సిద్ధంగా ఉన్న ఆశావహులు ఆవేదన చెందుతున్నారు. కాగా, రఘునాథపాలెం మండలంలో మొదటి దశ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొత్తం 1,352 ఇళ్లు మంజూరయ్యాయి.
ఇప్పటికి 74 శాతం మంది మాత్రమే ఇంటి నిర్మాణాలు ప్రారంభించుకోగా.. ఇంకా 26 శాతం మంది లబ్ధిదారులు అసలు పనులు చేపట్టే దిశగా ఆలోచించడం లేదని తెలుస్తోంది. వారికి మంజూరు పత్రంలో ఇచ్చిన 45 రోజుల గడువు సైతం పూర్తయ్యింది. ఇక ఇళ్లు కట్టుకుంటారనే ఆశలు కూడా లేవని అధికారుల నుంచి వినిపిస్తోంది. ఈ విషయం తెలిసి.. ఇళ్లు కట్టుకునేందుకు ఎదురుచూస్తున్న పేదలు ఇందిరమ్మ కమిటీల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.