భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మ ండలంలో మొత్తం 243 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. అందులో రాయిపాడు గ్రామంలో 84 ఇళ్లు పైలట్ ప్రాజెక్టు కింద మంజురయ్యాయి. మిగతా 159 ఇళ్లలో 21 ఇళ్లు బేస్మెంట్ స్థాయి నిర్మాణాలు పూర్తయి నెల రోజులు దాటింది. కానీ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఇంత వరకూ మొదటి విడత బిల్లు కింద రూ.లక్ష చొప్పున జమ కాలేదు. దీంతో వారు పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోతోంది.
బేస్మెంట్ లేవెల్ పూర్తయిన ఇళ్ల నిర్మాణాల ఫొటోలను పంచాయతీ కార్యదర్శులు ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ చేశారు. కానీ, అవి తన లాగిన్లోకి రాలేదని హౌసింగ్ ఏఈ చెబుతున్నాడు. అయితే, హౌంసింగ్ అధికారులు మరో సమాధానం చెబుతున్నారు. ఈ మండలంలోని బోడాయికుంట, నడిమిగూడెం, మర్కోడు, రఘవాపురం, అడవిరామవరం, పెద్ద వెంకటాపురం, దొంగతోగు గ్రామాలు ఆఫ్లైన్లో ఉన్నాయని అంటున్నారు. ఈ గ్రామాల్లో ఎయిర్టెల్ సిగ్నల్ లేని కారణంగా అక్కడి ఇళ్లను ఆన్లైన్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పారు.
ఆళ్లపల్లి మండలంలో 21 ఇళ్లు బేసెమెంట్ స్థాయి నిర్మాణాలు పూర్తయ్యాయి. అందులో ఆళ్లపల్లిలో రెండిళ్లు మాత్రమే ఆన్లైన్ అయ్యాయి. ఎయిర్టెల్ సిగ్నల్ లేని కారణంగా మిగతా 19 ఇళ్లను ఆన్లైన్ చేయలేకపోతున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. సిగ్నళ్లు, సాంకేతిక సమస్యలు లేకుండా యాప్ను అప్డేట్ చేసి ఇస్తామని చెప్పారు. ఆ వెంటనే ఆన్లైన్ చేసి బిల్లులు చెల్లిస్తాం.
– డేవిడ్, హౌసింగ్ ఏఈ
మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. జూలై మొదటి వారంలో ముగ్గుపోసి నిర్మాణం ప్రారంభించాము. 15 రోజుల్లోనే బేస్మెంట్ నిర్మాణాన్ని పూర్తిచేశాం. మా బేస్మెంట్ను పంచాయతీ అధికారులు ఫొటో తీశారు. అప్లోడ్ చేశామని కూడా చెప్పుతున్నారు. నెల రోజులైన ఇంకా మాకు మొదటి విడత బిల్లు మంజూరు కాలేదు.
-ముప్పారపు కోటమ్మ, మర్కోడు, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలు