నమస్తే నెట్వర్క్, మే 4 : రేవంత్ సర్కారు అంతులేని నిర్లక్ష్యం.. అన్నదాతలకు తీరని శాపంలా మారింది. రెక్కలుముక్కలు చేసుకొని పండించి రేయింబవళ్లూ కంటికి రెప్పలా కాపాడిన ధాన్యం.. కేవలం సర్కారు అలక్ష్యం కారణంగా అకాల వర్షార్పణమైంది. కర్షకుల కళ్లముందే కొట్టుకుపోయింది. ఆరుగాలపు శ్రమ అర్ధాంతరంగా వరద నీటి పాలు కావడంతో అన్నదాతకు అరిగోసే మిగిలింది.
సమాయానికి కొనుగోలు చేయడం, ఆ వెంటనే మిల్లులకు తరలించడం వంటి చర్యలను సర్కారు సకాలంలో చేపట్టి ఉంటే అన్నదాతకు ఇంత గోడు ఉండేది కాదు. కానీ కర్షకులపై కరుణలేని కాంగ్రెస్ సర్కారు.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఏ ఒక్క ముందస్తు చర్య కూడా తీసుకున్న దాఖలాలు కూడా లేకుండాపోయాయి. ఫలితంగా కంటిమీద కనుకు లేకుండా కర్షకులు కాపాడుతున్న ధాన్యమంతా అకాల వర్షానికి తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కర్షకులకు కన్నీరే మిగిలింది.
ఉమ్మడి జిల్లాలో ఆదివారం కురిసిన అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. అశ్వాపురం, మధిర, దమ్మపేటల్లో తీవ్రత అధికంగా ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, కలాల్లో ఆరబోసిన ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది. మిగతా మండలాల్లో తడిసి ముద్దయింది. దమ్మపేట యార్డులో 15 రోజులుగా రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. తేమ వచ్చిన సమయంలోనూ సర్కారు కొనుగోలు చేయలేదు. ఈ మధ్య కొనుగోళ్లు చేపట్టిన ధాన్యాన్ని కూడా వెంటనే లోడింగ్ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది.
దీంతో ఆ ధాన్యం కూడా కొనుగోలు కేంద్రంలోనే ఉంది. అయితే, రైస్ మిల్లులకు ధాన్యం చేరే వరకూ రైతుదే బాధ్యతంటూ ప్రభుత్వం స్పష్టం చేయడంతో పంటను విక్రయించిన రైతులు కూడా దానిని కాపాడుతూ కేంద్రాల్లో పడిగాపులు కాశారు. ధాన్యం విక్రయాలు పూర్తయిన రైతులతోపాటు ధాన్యం కొనుగోళ్లు, కాంటాలు పూర్తికాని రైతులు కూడా తమ ధాన్యాన్ని మార్కెట్ యార్డులో ఆరబోసుకొని ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం వచ్చిన వర్షానికి ఆ ధాన్యమంతా తడిసింది.
అశ్వాపురం మార్కెట్యార్డులోని ధాన్యం అక్కడి డ్రైనేజీ కాలువలోకి కొట్టుకుపోయింది. గోనె సంచుల కొరత, హమాలీల గైర్హాజరు కారణంగా వారం రోజులుగా కొనుగోళ్లు జరగడం లేదు. దీంతో ధాన్యం రాసులు పెరిగిపోయాయి. ఆదివారం వర్షానికి యార్డులో ఆరబెట్టిన ధాన్యమంతా డ్రైనేజీ కాలువలోకి కొట్టుకుపోయింది. అమ్మగారిపల్లి, మొండికుంట కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యమూ తడిసిపోయింది.
మధిర కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యమూ తడిసిపోయింది. కొంతమంది రైతులు ధాన్యంపై టార్పాలిన్లు కప్పినప్పటికీ ప్రయోజనం కన్పించలేదు. మార్కెట్ యార్డు ప్లాట్ఫాం మీద ఆరబోసి ఉన్న ధాన్యం కొట్టుకుపోయింది. 15 రోజులుగా ధాన్యాన్ని ఇక్కడే ఆరబెడుతున్నామని అన్నదాతలు చెబుతున్నారు. తడిసిన ధాన్యాన్ని వారం రోజులపాటు ఆరబెడితేనే కొనుగోలు చేస్తామని మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు.
బూర్గంపహాడ్ మండలంలో పది రోజుల్లో నాలుగుసార్లు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సోంపల్లి కొనుగోలు కేంద్రం వద్ద ఐదురోజులుగా ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదు. అక్కడ సుమారు 100 మంది రైతులు దాదాపు 20 రోజులుగా ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ఈ లోపు నాలుగైదు సార్లు వర్షం వచ్చింది. అయితే, తమ కొనుగోలు కేంద్రానికి లారీలు రావడం లేదంటూ నిర్వాహకులు చెబుతుండడం గమనార్హం.
చండ్రుగొండ, దుమ్ముగూడెం, అన్నపురెడ్డిపల్లి, పాల్వంచ, ములకలపల్లి, అశ్వారావుపేట మండలాల్లో కూడా ఆదివారం అకాలం వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో ఉన్న తమ ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు పరుగులు పెట్టారు. దుమ్ముగూడెం మండలంలోని పలు కల్లాల్లో మిర్చి రైతులు కూడా మిర్చిన ఆరబోసి ఉన్నారు. ఈ వర్షాలతో వాళ్లూ ఆందోళన చెందుతున్నారు.
అశ్వారావుపేట మండలంలో ఆదివారం కురిసిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. వరద నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. అయినా సొసైటీ అధికారులు సకాలంలో ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోలేదు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూలీల కొరత సాకు చూపుతూ ధాన్యం సేకరణలో జాప్యం చేస్తున్నారు. ప్రభుత్వం తీరుపై అసహనంతో కొందరు రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేటులో తక్కువ ధరకే విక్రయించుకున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ధాన్యం సేకరణలో జాప్యం చేస్తూ రైతులే ప్రైవేట్ రైస్ మిల్లులకు ధాన్యం విక్రయించుకునేలా ప్రోత్సహిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే, జిల్లా అధికారులు వచ్చి కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నప్పటికీ ఇక్కడి సొసైటీ సీఈవో మాత్రం అందుబాటులో ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చిన ధాన్యం నింపుకునేందుకు గోనె సంచులు కొరత తీవ్రంగా ఉంది. దీంతో రైతులందరమూ ఇబ్బందులు పడుతున్నాం. ఆదివారం ఉదయం ఒక్కసారిగా కురిసిన వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించినప్పటికీ గోనెసంచుల కొరత కారణంగా ఫలితం లేకుండా పోయింది. దీంతో ధాన్యమంతా తడిసిపోయింది. దీనికితోడు చార్జీలు చెల్లించడంలేదంటూ హమాలీలు కూడా పనిలోకి రాలేదు. దీంతో ధాన్యాన్ని కాపాడుకునే అవకాశం లేకుండాపోయింది.
-వేల్పుల వెంకన్న, రైతు, అమ్మగారిపల్లి, అశ్వాపురం
ఎకరమున్నరలో వరి సాగుచేసి పంటను కోసుకుని నేరుగా కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకువచ్చాను. 20 రోజులైనా కేంద్రం నిర్వాహకులు నా పంటను కొనుగోలు చేయలేదు. అడిగితే.. ‘లారీలు రావడంలేదు. మేమేం చేయాలి?’ అని అంటున్నారు. మరోవైపు ఈ అకాల వర్షాల వల్ల పంటను కాపాడుకునేందుకు నానా తంటాలూ పడాల్సి వస్తోంది. ఇప్పటికే ఈ నెలలో నాలుగుసార్లు వర్షం వచ్చింది. పంటను కొనుగోలు చేయడంలో జాప్యమెందుకు అర్థం కావడం లేదు.
-నడిపింటి చంద్రం, రైతు, సోంపల్లి