ఆరుగాలం శ్రమించి ఆహార ధాన్యం పండిస్తున్న అన్నదాతకు కష్టనష్టాలే తప్ప ప్రతిఫలాలు అందడం లేదు. అహరహమూ చెమటను ధారపోసి, ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి సాగు చేపట్టిన రైతన్నకు చివరికి అప్పులే మిగులుతున్నాయి. దీనికితోడు ప్రభుత్వాలూ అన్నదాతను ఆదుకోకపోవడం, కనీసం దిగుబడి పెరిగేందుకూ ఎరువులు అందించలేకపోవడం వంటి కారణాల వల్ల వారి ఆశలన్నీ అడియాశలవుతున్నాయి. దుమ్ముగూడెం మండలంలోని కొందరు రైతుల వద్ద ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ గణాంకాలే అన్నదాతల దైన్యానికి అద్దం పడుతున్నాయి. -దుమ్ముగూడెం, నవంబర్ 23
దుమ్ముగూడెం మండలంలోని 22 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. యూరియా కొరతలు, వర్షాలు, వరదల వంటి ఆటంకాలను తట్టుకొని కొంతమేరకు పంట చేతికొచ్చింది. దీంతో ఇటీవల వరికోతలు ముమ్మరమయ్యాయి. అయితే, ఎకరాకు 15 బస్తాల మాత్రమే దిగుబడి రావడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఏటా ఎకరాకు 40 బస్తాలు వచ్చే దిగుబడి ఈ ఏడాది కేవలం 15 బస్తాలు మాత్రమే వచ్చింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఈ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ సేకరణను మాత్రం ఇంకా ప్రారంభించలేదు.
మండలంలోని నర్సాపురం, సీతారామపురం, దుమ్ముగూడెం, బైరాగులపాడు, కే.లక్ష్మీపురం, గోవిందాపురం గ్రామాల్లో సహకార సంఘాల ద్వారా, చినబండిరేవు, మహదేవపురం, చిన్ననల్లబెల్లి, మారాయిగూడెం గ్రామాల్లో జీసీసీల ద్వారా, నర్సాపురం, ములకపాడు, ఆర్లగడెం గ్రామాల్లో ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. చినబండిరేవు, చిన్ననల్లబెల్లి, ఆర్లగూడెం గ్రామాల్లో వరి కోతలు 50 శాతం పూర్తయ్యాయి. అయితే, ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయట్లేదని రైతులు చెబుతున్నారు.
పంటల పెట్టుబడి కోసం మండలంలోని కొందరు వ్యాపారులు కొందరు రైతులకు పెట్టుబడి పెట్టి ఉన్నారు. ఇప్పుడు పంట చేతికి వస్తుండడంతో తిరిగి ఆ పంటను వారే తక్కువ ధరకు తీసుకుంటున్నారు. సీజన్ ప్రారంభంలో ఎరువులు, పురుగుమందులు అప్పుగా ఇచ్చిన వ్యాపారులకు మరికొందరు రైతులు విక్రయిస్తున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఒక రైతు ఎకరం పొలం కౌలుకు చేసినట్లయితే భూయజమానికి పది నుంచి 12 బస్తాల కౌలు కొలవాలి.
దీంతోపాటు ఎకరా విస్తీర్ణంలోని వరి పంటను వరికోత యంత్రం కోసేందుకు గంట నుంచి గంటన్నర వరకు సమయం తీసుకుంటుంది. దీంతో ఆ యంత్రానికే ఎకరాకి రూ.5 వేల చొప్పున ఖర్చవుతుంది. భూ యజమానికి 12 బస్తాల కౌలు తీసి, వరికోత యంత్రానికి రూ.5 వేల ఖర్చు పెట్టడంతో కౌలు రైతుకు మిగిలేదేమీ లేకుండా పోతోంది. అసలు ఇప్పటికే దిగుబడులు అమాంతం తగ్గడం, ఆరుగాలం చెమటోడ్చినా పైసా కూడా లాభం రాకపోవడం వంటి కారణాలతో అన్నదాతలు కన్నీటిపర్యంతమవుతున్నారు.