ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నానాటికీ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో ఈ ఏడాది ఇంటర్మీడియట్ విద్య కళావిహీనంగా కనిపిస్తున్నది. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటర్ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ధోరణి కనిపిస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో ఇబ్బడిముబ్బడిగా చేరే విద్యార్థులు సైతం ఈ విద్యాసంవత్సరం విముఖత చూపిస్తున్నారు.
కనీస వసతులు లేక కునారిల్లుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరడం లేదు.. ప్రైవేట్ కళాశాలల వెంటే పరుగులు పెడుతున్నారు. ఇప్పటివరకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు రాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రాకపోవడం గమనార్హం. – ఖమ్మం అర్బన్, జూన్ 13
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖమ్మం నగరంలోని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం(2023-24) అడ్మిషన్లు 300 అయ్యాయి. ఇప్పుడు అదే కళాశాలలో ఈ విద్యా సంవత్సరం(2025-26) కేవలం 40 అడ్మిషన్లు మాత్రమే పూర్తయ్యాయి. జిల్లాలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన కళాశాలగా నయాబజార్‌కు పేరున్నప్పటికీ గత ఏడాది వచ్చిన వరదల వల్ల కళాశాలలో చాలా సమస్యలు తిష్టవేశాయి.
ప్రభుత్వం ఏదో నామమాత్రంగా స్పందించగా.. దాతల సహకారంతో కళాశాలను మళ్లీ నిర్వహణలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ కళాశాలలో అడ్మిషన్లు బాగా తగ్గాయి. 2015లో కేసీఆర్ ప్రభుత్వం పలు కళాశాలలకు ఊపిరిపోసింది. పేద విద్యార్థులు పదో తరగతితో చదువు ఆపేయాల్సిన దుస్థితి అసలే ఉండొద్దని, ఉన్నత విద్యను సామాన్యుడికి కూడా చేరువ చేశారు అప్పటి సీఎం కేసీఆర్. దీంతో మూత పడతాయనుకున్న పలు గ్రామీణ ప్రాంత ప్రభుత్వ జూనియర్ కళాశాలలు పేద విద్యార్థుల చేరికతో కళకళలాడాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరైన, మంజూరుకాని పోస్టులకు సైతం ఫుల్, పార్ట్ టైం ఉద్యోగులను నియమించి జీతాలు చెల్లించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదు. ఇద్దరేసి అధ్యాపకులతో నడవాల్సిన వృత్తి విద్యాకోర్సులను ఒక్కరికే పరిమితం చేసి విద్యార్థుల అడ్మిషన్లకు అవకాశం లేకుండా చేసింది. రెండో సార్ లేకపోవడంతో అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి. ఒక్క అధ్యాపకుడే ప్రథమ, ద్వితీయ సంవత్సరంలోని విద్యార్థులకు చదువు చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల వృత్తి విద్యాకోర్సుల్లో చేరడానికి విద్యార్థులు సుముఖత చూపించడం లేదు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రారంభంకాగానే కనీసం మౌలిక వసతుల కోసం అవసరమైన నిధులు మంజూరు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. పలుమార్లు కళాశాలల ప్రిన్సిపాల్స్ విజ్ఞప్తుల మేరకు ఈ ఏడాది రూ.10 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నది. కళాశాలలో టాయిలెట్స్ శుభ్రం చేయడానికి, తరగతి గదులను సక్రమంగా నిర్వహించడానికి ఒక్క కళాశాలకు కూడా స్వీపర్లు, స్కావెంజర్లు లేరు. గత ప్రభుత్వం మాత్రం కళాశాలల్లో మిగులు ప్రత్యేక ఫీజులను అందుకు వినియోగించుకోవచ్చంటూ అనుమతులు ఇచ్చింది. కళాశాలల్లో నెలకొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కొందరు దాతల సహాయం కోసం వెతుకులాడుతుండగా, మరికొందరు తమ జేబుల్లో నుంచి ఖర్చు పెడుతున్నారు.
ప్రైవేట్ కళాశాలలు డిసెంబర్, జనవరికల్లా అడ్మిషన్లు పూర్తిచేస్తున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో మే, జూన్‌లో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలోని మొత్తం 21 జూనియర్ కళాశాలల్లో సుమారు 50కిపైగా అధ్యాపక పోస్టులు ఖాళీ ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య తక్కువగా పలు కళాశాలల ప్రిన్సిపాల్స్ గత సంవత్సరాల్లో చదువు మానేసిన తమ కళాశాల విద్యార్థులనే తిరిగి ప్రవేశాలు కల్పించి విద్యార్థులు పెరిగినట్లుగా చూపించి అతిధి అధ్యాపక పోస్టులను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇటీవల ప్రిన్సిపాల్స్ జూమ్ సమావేశంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి చేసిన వ్యాఖ్య కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. పట్టణాలకు చేరువగా ఉన్న కొన్ని ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ కళాశాలల్లో చదివే విద్యార్థుల వివరాలను ప్రభుత్వ కళాశాలల్లో నమోదు చేయించి తమ కళాశాలల పేరుతో బోధన కొనసాగిస్తున్నట్లుగా బోర్డును తప్పుదారి పట్టిస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు.
జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలులున్నాయి. వీటిల్లో 16 కళాశాలల్లో 50లోపే అడ్మిషన్లు ఉన్నాయి. 50కిపైగా అడ్మిషన్లు కళాశాలలు పెనుబల్లి 65, సింగరేణి 81, ఏన్కూరు 54, ఖమ్మం బాలికల కళాశాల 76, ఏఎస్ఆర్ కళాశాలలో 146 జనరల్ సీట్లలో అడ్మిషన్లు నమోదయ్యాయి. తిరుమలాయపాలెం 2, కామేపల్లి 3, వేంసూరు 5, బోనకల్ 10, ముదిగొండ 13, వైరా 15, సత్తుపల్లి 22, సత్తుపల్లి బాలికలు 33, నయాబజార్ ఖమ్మం 30, బనిగండ్లపాడు 23, చింతకాని 31, కల్లూరు 33, నేలకొండపల్లి 40, సిరిపురంలో 42 అడ్మిషన్లు అయ్యాయి.
బాలికల తల్లిదండ్రులు హాస్టల్స్ అడుగుతున్నారు. అడ్మిషన్లు పెంచేందుకు ప్రిన్సిపాల్స్‌కు తగిన సూచనలు చేశాం. జూన్ చివరి నాటికి అన్ని సమస్యలను అధిగమించి అడ్మిషన్ల సంఖ్య రెట్టింపు చేస్తాం. ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను గెస్ట్ ఫ్యాకల్టీతో త్వరలో భర్తీ చేస్తాం. పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటాం.
– రవిబాబు, డీఐఈవో, ఖమ్మం